విలవిల.. వెలవెల | - | Sakshi

విలవిల.. వెలవెల

Apr 2 2025 1:33 AM | Updated on Apr 2 2025 1:33 AM

విలవి

విలవిల.. వెలవెల

● కళా విహీనంగా జూనియర్‌ కళాశాలలు ● మొదలైన ఇంటర్‌ సెకండియర్‌ తరగతులు ● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు ● మొదటి రోజు హాజరు 4.3 శాతం మాత్రమే

కర్నూలు సిటీ/నంద్యాల(న్యూటౌన్‌): ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఇంటర్‌ సెకండియర్‌ తరగతులను మంగళవారం ప్రారంభించడంతో విద్యార్థులకు కష్టాలు తప్పలేదు. ‘పుస్తకాలు ఇవ్వలేదు..సారోళ్లు రాలేదు.. ఇలాగైతే ఎలా చదవాలి’’ అంటూ చాలా మంది విద్యార్థులు విలవిల ఏడ్చారు. చాలా జూనియర్‌ కాలేజీలకు విద్యార్థులు రాకపోవడంతో తరగతులు వెలవెల కనిపించాయి. ఇంటర్మీడియట్‌ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సంస్కరణలపై విద్యార్థులకు ఆసక్తి చూపడం లేదు. కొత్తగా 2025–26 విద్యా సంవత్సరం అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో మార్పులు చేశారు. వేసవిలో కూడా తరగతులు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు మంగళవారం సెకండియర్‌ తరగతులు ప్రారంభించారు. కాలేజీలు ప్రారంభించిన మొదటి రోజునే విద్యార్థుల చేతిలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రికార్డులు అందజేస్తామని ప్రకటించారు. కానీ అసలు జిల్లాకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. ఎలాంటి ముందస్తూ కసరత్తు లేకుండా, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా పబ్లిక్‌ పరీక్షలు ముగిసి రెండు వారాలకే తరగతులు ప్రారంభించడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మొదటి రోజు హాజరును బట్టి తెలుస్తుంది. ఇంటర్మీడియట్‌ విద్యలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను అమలు చేసి, సిలబస్‌ను, పరీక్ష నమూనాలోను మార్పులు చేశారు. ఇదీ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు మాత్రమే. అయితే సెకండియర్‌ సిలబస్‌, పరీక్షల నమూనాలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ అకడమిక్‌ క్యాలెండర్‌లో చేసిన మార్పులకు అనుగుణంగా తరగతులను ప్రారంభించడం, గత నెల మొదటి వా రం జరిగిన పరీక్షల మూల్యాంకనం ఇంకా పూర్తి కాక ముందే విద్యా సంవత్సరం మొదలు కావడంపై అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొదటి రోజు హాజరు 4.30 శాతమే!

జిల్లాలో 23 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, 16 ఏపీ మోడల్‌ స్కూల్‌ కాలేజీలు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు 26, ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు రెండు, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలు 8, మహత్మజ్యోతిరావు ఫూలే కాలేజీలు 01, ఎయిడెడ్‌ కాలేజీలు 04 మొత్తం 80 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలకు చెందిన సుమారు 7,769 మంది విద్యార్థులు ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 4,099 మందికిగాను కేవలం 175 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన కాలేజీలు ప్రారంభం అయినా విద్యార్థులు హాజరుకాలేదు. విద్యార్థులు హాజరైన కాలేజీల్లో కూడా రెండు, మూడు చోట్ల మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని పెట్టారు.

జీరో శాతం హాజరు ఉన్న జూనియర్‌ కళాశాలల వివరాలు..

జిల్లాకు చేరని పుస్తకాలు

ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద ఉచితంగా కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లా పాఠ్యపుస్తకాలు 85,345, నోటు పుస్తకాలు 1,73,532, రికార్డులు 17,629 అవసరమని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఇండెంట్‌ పెట్టారు. వీటిలో ఒక్కటి కూడా జిల్లాకు చేరలేదు.

ఎలా చదవాలి?

పరీక్షలు ముగిశాయి. ఇంటర్‌ రెండో సంవత్సరం కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యాయి. పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఎలా చదవాలి? ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 273 మంది విద్యార్థులకు గాను 16మంది మొదటి రోజు హాజరయ్యారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రారంభమైన రోజున పుస్తకాలు ఇవ్వలేదు.

–యాకూబ్‌, వెంకటేశ్వరపురం, నంద్యాల

పది రోజులకే తరగతులా?

మొదటి సంవత్సరం ఇంటర్‌ ఫలితాలు వచ్చిన తర్వాత రెండో సంవత్సరం తరగతులు నిర్వహిస్తే మంచిది. మొదటి సంవత్సరం పరీక్షలు రాసి 10 రోజులు గడవకముందే రెండో సంవత్సరం తరగతులు నిర్వహించడంతో ఇబ్బంది. మొదటి రోజు కాలేజీలు ప్రారంభం రోజున 16 మంది విద్యార్థులు హాజరయ్యారు. ముగ్గురు లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌ కాలేజీకి వచ్చారు. ఇంటర్‌ రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఏం చదవాలో, రాయాలో అర్థం కాలేదు. – లలిత, నంద్యాల

విలవిల.. వెలవెల 1
1/2

విలవిల.. వెలవెల

విలవిల.. వెలవెల 2
2/2

విలవిల.. వెలవెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement