నారాయణపేట: వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పనిసరి అని, ఏదైనా ఒక వస్తువు కొని, ఆ వస్తువు నకిలీ లేదా నాసీరకం అయితే ఆ వస్తువుని అమ్మిన వ్యాపారి పై లేదా ఉత్పత్తిదారులపై వినియోగదారుల ఫోరంలో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చన్నారు. డీఏఓ జాన్ సుధాకర్ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కుల చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని అన్నారు. ఫోరం సభ్యుడు అశోక్, హజమ్మ మాట్లాడుతూ.. పుట్టిన పిల్లాడి నుంచి చనిపోయే వరకు అందరూ వినియోగదారులే అవుతారని, కల్తీ రహిత సమాజాన్ని నిర్మించాలంటే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. బంగారం నుంచి మొదలుకొని పాలిథిన్ కవర్ వరకు ప్రతీ వస్తువుకు అది మంచిదా? లేక నకిలీదా అని తెలిపేందుకు హాల్ మార్క్, ఐఎస్‌ఐ లాంటి గుర్తులు ఉంటాయని, వాటిని చూసిన తర్వాతే మనం కొనుగోలు చేయాలని వారు సూచించారు. సమావేశంలో పలువురు ఫోరం సభ్యులు, రేషన్ డీలర్లు వినియోగదారుల హక్కుల చట్టం తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నిటిని కలెక్టర్‌కు నివేదించడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బాల్‌రాజ్ తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం మాసన్న, డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.