నారాయణపేట: యువత బెట్టింగ్, గేమ్ యాప్‌లకు అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడినా, ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడినా, ఎవరైనా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో చాలా మంది అవగాహన లోపంతో అక్రమ యాప్‌లతో మోసపోతున్నారని తెలిపారు. మోసపూరిత ప్రకటనలను నమ్మి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు పెట్టడం, గ్రేమ్స్ ఆడటంవల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తద్వారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్‌లు చాలా ప్రమాదకరమైనవని.. వీటిలో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుందన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫార్మర్లు వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో వ్యసనం పెరుగుతుందన్నారు. వీటి కట్టడికి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు, యువత అప్రమత్తంగా ఉంటూ.. ఇలాంటి కార్యకలాపాలపై డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
దరఖాస్తు చేసుకోండి
నారాయణపేట ఎడ్యుకేషన్: మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఖాజా బహ్రుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకులాలు ఉండగా.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
కృష్ణా: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదువుకుని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. మండలంలోని ముడుమాల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముడుమాల్ గ్రామంలోని నిలువురాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయో.. అదే విధంగా పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి జిల్లాకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ నిజాముద్దీన్, కాంప్లెక్స్ హెచ్‌ఎం గణేశ్‌సింగ్, ఏఎంఓ విద్యాసాగర్, రిటైర్డ్ జీహెచ్‌ఎం రాఘవేంద్రరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతనుఅలవర్చుకోవాలి
మాగనూర్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని నేరడగంలో శ్రీపశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాముల విరక్తమఠం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్వామి వారిని ఎంపీ దర్శించుకున్నారు. మఠం ఆవరణలో మహిళలకు ఒడినింపే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభించడంతో పాటు అన్నింటా సత్ఫలితాలు ఉంటాయన్నారు. మఠం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
అలసందలు @ రూ.7,156
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం అలసందలు క్వింటాల్ గరిష్టంగా రూ. 7,156, కనిష్టంగా రూ. 7,073 ధరలు వచ్చాయి. పెసర గరిష్టంగా రూ. 7,620, కనిష్టంగా రూ. 7,440, వేరుశనగ గరిష్టంగా రూ. 5,200, కనిష్టంగా రూ. 4,524, జొన్నలు గరిష్టంగా రూ. 4,705, కనిష్టంగా రూ. 2,816, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,263, కనిష్టంగా రూ.6వేలు, తెల్లకందులు రూ. 7,411 ధరలు వచ్చాయి.
బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి : ఎస్పీ