ప్రశాంతంగా పరీక్షలు రాయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పరీక్షలు రాయాలి

Mar 20 2025 1:11 AM | Updated on Mar 20 2025 1:09 AM

నారాయణపేట రూరల్‌: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా కేంద్రాలకు చేరుకోవాలని.. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించి.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లాను నిలపాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. ఈ నెల 21నుంచి జరగనున్న టెన్త్‌ పరీక్షలకు జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని.. గత పరీక్షలతో పోలిస్తే ఈ సారి కొంత మార్పులు జరిగాయని.. జీపీఏ బదులు మార్కులు ప్రకటించే అవకాశం ఉందని.. పరీక్ష నిర్వహణలో సైతం ఓఎంఆర్‌ షీట్‌తో పాటు సమాధాన పత్రానికి బదులు 24 పేజీల బుక్‌లెట్‌ అందుబాటులోకి తీసుకురానున్నారని వివరించారు. ఇక పరీక్ష కేంద్రాల ఎంపిక, అవసరమైన సౌకర్యాలు, పరీక్ష పత్రాలు చేర్చడం తదితర అంశాలపై బుధవారం డీఈఓ గోవిందరాజు ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతి

ప్రతి రోజు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్షకు 20 నిమిషాలు అదనంగా ఉంటుంది. భౌతిక, జీవశాస్త్రం పేపర్‌ గంటన్నర మాత్రమే ఉంటుంది. పరీక్ష హాల్‌లోకి గంట ముందే విద్యార్థులను అనుమతిస్తాం. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షకు ముందే విద్యార్థుల సమాచారం ఇన్విజిలేటర్లు నమోదు చేసుకుంటారు. గతంలో 11 పరీక్షలు ఉండేవి. ఈ సారి కేవలం ఏడు పరీక్షలు మాత్రమే ఉండనున్నాయి.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా శిక్షణ ఇచ్చాం..

ఈ పరీక్షల నిర్వహణ ప్రతీ టీచర్‌కు సవాల్‌గా మారింది. పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సిలబస్‌ పూర్తి అయిన వెంటనే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌ నిర్వహించడంతో పాటు రివిజన్‌ టెస్టులు, గ్రాండ్‌ టెస్ట్‌, ఫ్రీ ఫైనల్‌ పరీక్షలను రాయించి తప్పులను సరిచేసుకునే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. వందశాతం ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ సంఖ్యలో అత్యధిక మార్కులు (జీపీఏ) సాధనకు కృషిచేస్తున్నాం. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులతో ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసి వారి స్థాయికి తగ్గట్లు విషయ పరిజ్ఞానాన్ని అందించాం. చివరగా విద్యార్థులు ఇప్పటి వరకు చదివిన అంశాలనే నివృత్తి చేసుకోవాలి. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో ఒక రోజు ముందుగానే వచ్చి చూసుకోవడం మంచిది. పరీక్షకు వచ్చే ముందు అల్పాహారం తీసుకోవాలి. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.

ఫీజుల పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకుంటే చర్యలు

ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల పేరుతో హాల్‌టికెట్లు ఆపినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు సైతం ‘బీఎస్‌ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా తమ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హెచ్‌ఎం సంతకం లేకుండానే పరీక్షకు నేరుగా హాజరు కావచ్చు. విద్యార్థుల సందేహాల నివృత్తికి జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షలకు సంబందించి ఏమైన ఇబ్బందులు, ఫిర్యాదులు, సలహాలు తెలియచేయాలనుకుంటే సెల్‌ నం.9502051806 కు సమాచారం ఇవ్వడానికి అందుబాటులో ఉంచాము.

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దు

జిల్లాలో పరీక్షల నిర్వహణకు

పకడ్బందీ ఏర్పాట్లు

హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా

ప్రత్యేక తరగతులు నిర్వహించాం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ గోవిందరాజులు

ప్రశాంతంగా పరీక్షలు రాయాలి 1
1/1

ప్రశాంతంగా పరీక్షలు రాయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement