
ఎల్‌ఆర్‌ఎస్ @ 920
నారాయణపేట: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2020లో దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు 34,396లో 17,303 ఆమోదం పొందాయి. మూడు మున్సిపాలిటీల్లో 21,384 దరఖాస్తులు రాగా..140 జీపీల్లో 13,012, రూ.10 వేలు చెల్లించిన వెంచర్లు 403 ఉన్నాయి. ఇందులో నిషేధిత జాబితాలో మూడు మున్సిపాలిటీల్లో 3, గ్రామాల్లో 3 వెంచర్లను అధికారులు గుర్తించారు. ఈనెలాఖరు వరకు ఎస్‌ఆర్‌ఎస్ చేయించుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తున్నారు. కాగా వీరిలో 920 మంది మాత్రమే స్పందించి క్రమబద్ధీకరణ చేసుకున్నారు.
సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు
ఎల్‌ఆర్‌ఎస్ రుసుంలో తప్పిదాలు వస్తున్నాయి. ఎస్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ యాప్ రూపొందించింది. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, సిటిజన్ లాగిన్లు ఇచ్చారు. దరఖాస్తుదారులకు ఇచ్చిన సిటిజన్ లాగిన్‌ఫై అవగాహన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తుదారుడి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా ఫీజులు వేయాలి. ఆన్‌లైన్‌లో వచ్చిందే ఫీజు అంటున్నారే తప్పా.. ఏ దానికి ఎంత అని వివరించలేకపోతున్నారు. సిస్టమ్‌లో వచ్చిందే కరెక్టు.. ఆ సిస్టమేంటో చెప్పాలంటే చెప్పాలేకపోతున్నారు.
రాయితీ ఇచ్చినా స్పందన అంతంతే
34,396 దరఖాస్తులకు
17,303 ఆమోదం
రూ.25 కోట్ల లక్ష్యానికి
వచ్చింది రూ.1.65 కోట్లే..
మిగిలింది 8 రోజులే..
రాయితీతో మేలు
అనధికార లే అవుట్లు, ప్లాట్లు క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీతో చెల్లించాలి. మిగిలింది 8 రోజులు మాత్రమే. ఈ సువర్ణ అవకాశాన్ని జిల్లాలోని రియల్టర్లు, ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– కిరణ్‌కుమార్, టీపీఓ, నారాయణపేట
అంతా ఆన్‌లైన్‌లోనే..
2020 కంటే ముందు 10 శాతం రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఎంతెంత ఫీజు వసూలు చేయాలని అంతా ఆన్‌లైన్‌లో చూపుతోంది. రూ.వెయ్యి కట్టిన వారు ఎల్‌ఆర్‌ఎస్‌తో పాటు రిజిస్ట్రేషన్ సైతం చేసుకోవచ్చు.
– రాంజీ,
సబ్‌రిజిస్ట్రార్, నారాయణపేట
స్పందన కరువు
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్)కు ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చినా దరఖాస్తు దారుల నుంచి స్పందన కరువైంది. బల్దియా పరిధిలో నామమాత్రంగానే ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకున్నారు. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయించుకోవాలని బల్దియా అధికారులు ప్రచారం చేస్తున్నా అంతంతే కనిపిస్తోంది. ఇక గ్రామీణప్రాంతాల్లో మరింత దారుణంగా ఉంది.