మద్దూరు: రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా వర్షాలు కురిసి కృష్ణానది పరవళ్లు తొక్కినా కూడా.. తాజాగా నదీ పరివాహక ప్రాంతం వారు సాగునీటి, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో కృతిమ కరువు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. మద్దూరులో సోమవారం విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి కోస్గి సభలో మార్చి 31 వరకు రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమచేస్తానని చెప్పారని, ఇప్పటి వరకు 3 ఎకరాలలోపు వారికే మాత్రమే డబ్బులు పడ్డాయని, మిగితా వారికి ఎందుకు పడలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం వల్లే నియోజకవర్గంలో తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి నెలకొందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చేదని, దానిని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. హామీల మేరకు వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సలీం, రామకృష్ణ, గోపాల్, మహిపాల్, నరేష్, నర్సింహా, రాములు, మహేందర్, చంద్రశేఖర్, జగదీశ్వర్, బాల్‌చందర్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, బీఆర్‌ఎస్ నాయకుడు సలీం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.