నారాయణపేట: వ్యాపార రంగంలో మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మంగళవారం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. అందులో భాగంగా మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు, రైస్‌మిల్లులు, సోలార్ పవర్ ప్లాంట్స్ మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇది జిల్లా మహిళలు సాధించిన గొప్ప విజయమన్నారు. అదే విధంగా ఇంకా ఏదైనా వినూత్నంగా ఆలోచించి వ్యాపార పరంగా జిల్లా మహిళా సమాఖ్య మరో ముందడుగు వేయాలని కలెక్టర్ సూచించారు. కాగా, మక్తల్‌లోనూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని ఉందని.. మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కన ప్రభుత్వ స్థలం ఉందని మండల మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్.. జిల్లాలో రెండో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే మంచిదే అని.. కానీ హైవే పక్కన స్థలంలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని చెప్పారు. మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం వివరాలను తెప్పించుకుంటానని తెలిపారు. సూపర్ మార్కెట్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ప్రైవేటు స్కూల్ ఏర్పాటు, మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయడం లాంటి వ్యాపారాలను ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చంద్రకళను శాలువా, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, అడిషనల్ డీఆర్డీఓ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్