నారాయణపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన ఆశావర్కర్లను పోలీసులతో నిర్బంధించడం దారుణమని తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అన్నారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. పోలీసులచే ఆశావర్కర్లను అరెస్టు చేయించిన మాత్రాన తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశావర్కర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఆశావర్కర్ల ఆందోళనకు వికలాంగుల హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.కాశప్ప, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నిర్మల, లక్ష్మి, శివమ్మ, నర్సమ్మ, రాధిక, మహేశ్వరి, నాగమణి, నర్మద పాల్గొన్నారు.