
రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించండి
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగ యువతకు అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వర్ వివరించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ పథకంపై వీసీ నిర్వహించారు. రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందుతారని, అర్హుల నుంచి ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రూ.50వేల లోపు రుణం వంద శాతం మాఫీ, రూ.లక్ష లోపు రుణం 90 శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందని, రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారని తెలిపారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆయా శాఖల ద్వారా పలుమార్లు ప్రకటనలు ఇచ్చామని, గ్రామీణ స్థాయిలో ఈ పథకానికి ఎక్కువమంది దరఖాస్తులు చేసుకునే విధంగా యువతను ప్రోత్సహించే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలిపారు. వీసీలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి అబ్దుల్ కలీల్, శామిమ్ సుల్తానా ఉర్దూ గ్రేడ్ టు అధికారి తదితరులు పాల్గొన్నారు.