
మహనీయుడు అంబేడ్కర్
● మహిళల అభ్యున్నతి, సమానత్వం కోసం ముందుకు సాగాలి
● బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి
● అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ
నారాయణపేట: మహిళల అభ్యున్నతి, సమానత్వం కోసం అంబేడ్కర్ రాజ్యాంగం రచించారని ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూజ, జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఆయన మార్గం అనుసరణీయం
ప్రతి ఒక్కరు అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చుతుందన్నారు. ఇటీవలె కుల గణన నిర్వహించారని, అలాగే అంబేడ్కర్ నాలెడ్జి సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు తాము రాజకీయ పదవులను అనుభవిస్తున్నామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో భాగంగా కులాంతర వివాహం చేసుకున్న ఇద్దరు దంపతులకు ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. అంతకు ముందు అదనపు కలెక్టర్లు బెన్ షాలోమ్, సంచిత్ గాంగ్వర్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, మార్కెట్ చైర్మన్ సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ కొనంగేరి హనుమంతు, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీ ఐ శివ శంకర్, ఈదప్ప, అధికారులు ఉమాపతి, అబ్దుల్ ఖలీల్, ఎం.ఏ. రషీద్,జాన్ సుధాకర్ పాల్గొన్నారు.
యువత అంబేడ్కర్‌అడుగుజాడల్లో నడవాలి
నారాయణపేట: రాజ్యాంగ రచయిత, న్యాయవాది, ఆర్థికశాస్త్రవేత్త అయినా బీఆర్ అంబేడ్కర్.. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి ఎస్పీ పూలమాలవేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని రచించి దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని, ఆయన ఆశయ సాధన దిశగా నేటి యువత నడుం బిగించాలన్నారు.

మహనీయుడు అంబేడ్కర్