అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి(86) శనివారం చనిపోయారు. ‘అమ్మ అహ్మదాబాద్‌లోని ఆమె సోదరి ఇంట్లో ఉన్నారు. ఎప్పటిలాగానే శనివారం ఉదయం కూడా కుటుంబసభ్యులతో గడిపారు. అసౌకర్యం అనిపిస్తోందని చెప్పడంతో డాక్టర్‌ను పిలిచాం. ఆయన వచ్చే సరికే చనిపోయారు. అప్పుడు సమయం 11.30 గంటలు’అని జాఫ్రి కుమారుడు తన్వీర్ తెలిపారు.
అయోధ్య నుంచి కరసేవకులతో వస్తున్న రైలుకు అహ్మదాబాద్‌లో దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది కరసేవకులు చనిపోవడం మరునాడే అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీ కాలనీపై జరిగిన దాడిలో ఎహ్సాన్ జాఫ్రి సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర కలహాలకు దారి తీశాయి. ఈ ఘటనల వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందంటూ అనంతరం జకియా జాఫ్రి సుప్రీంకోర్టు గడప తొక్కారు. న్యాయం పోరాటం చేపట్టి, దేశం దృష్టిని ఆకర్షించారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తదితరులపై చార్జిషీటు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసు బలగాలు చాలినంతగా లేరనే విషయం తెలిసి కూడా ఆయన ప్రభుత్వం సైన్యాన్ని మోహరించడంలో ఆలస్యం చేసిందని వాదించారు.
ఆమె వాదనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె ఆరోపణలపై విచారణకు సుప్రీం ఆదేశాలతో 2008లో సిట్ ఏర్పాటైంది. 2012లో సిట్ నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు కేసును మూసివేసింది. మోదీ, మరో 62 మందికి క్లీన్‌చిట్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె తిరిగి మెట్రోపాలిటన్ కోర్టుకు, తర్వాత గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. ఫలితం దక్కలేదంటూ చివరికి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు. చివరికి, జకియా జాఫ్రి వాదనల్లో పస లేదంటూ సుప్రీంకోర్టు 2022లో ఆమె అర్జీని కొట్టివేసింది. జకియా జాఫ్రి మరణంపై సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాడ్ స్పందించారు. దూరదృష్టి కలిగిన మానవతావాదిగా జకియా జాఫ్రిని అభివరి్ణంచారు.
Comments
Please login to add a commentAdd a comment