
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడి
గౌహతి/కొక్రాఝర్: బోడో ఒప్పందాన్ని అమలు చేసి ఈ ప్రాంతంలో శాంతిని, అభివృద్ధిని సుసాధ్యం చేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్(బీటీఆర్)లోని యువత నేడు తుపాకులకు బదులుగా త్రివర్ణ పతాకాన్ని ధరించారని ఆయన తెలిపారు. 2020లో బోడో ఒప్పందం కుదరడం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి ప్రకటించారు. ఆదివారం ఆయన అస్సాంలోని కొక్రాఝర్ జిల్లా దొట్మాలో ఆల్ బోడో స్డూటెండ్స్ యూనియన్(ఏబీఎస్‌యూ) 57వ వార్షిక భేటీని ఉద్దేశించి ప్రసంగించారు.
ఒప్పందం విషయంలో ఏబీఎస్‌యూ చూపిన చొరవ ఫలితంగానే నేడు శాంతియుత పరిస్థితులు సాధ్యమయ్యాయని చెప్పారు. లేకుంటే, బీటీఆర్‌లో శాంతి లేదు, బోడో ఒప్పందం ఒక జోక్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసి ఉండేదని ఆయన అన్నారు. ఒప్పందంలోని 82 శాతం షరతులను ఇప్పటికే అమలు చేశామని, వచ్చే రెండేళ్లలో 100 శాతం పూర్తవుతుందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) నుంచి పూర్తిగా మినహాయించామని వివరించారు.
మూడేళ్లలోనే ఎన్‌డీఎఫ్‌బీ సభ్యులు 4,881 మంది లొంగిపోయారని, వీరి పునరావాసానికి రూ.287 కోట్లు వెచ్చించామని ఇందులో 90 శాతం కేంద్రమే సమకూర్చిందని వివరించారు. 2020 జనవరి 27న ఏబీఎస్‌యూ, ఎన్‌డీఎఫ్‌బీ తదితర బోడో గ్రూపులతో కేంద్రం బోడో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే.
నేర చట్టాల అమలుపై అమిత్ షా సమీక్ష
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కొత్తగా అమల్లోకి వచి్చన నేర చట్టాలు బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్, బీఎస్‌ఏ చట్టాలు ఈశాన్య రాష్ట్రాల్లో అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఉండటంతో ఆ రాష్ట్రం తరఫున గవర్నర్ అజయ్ భల్లా హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోపాటు డీజీపీలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment