సాక్షి, న్యూఢిల్లీ: ఖాతాదారుల లాకర్ల విషయంలో బ్యాంకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కారద్ చెప్పారు. లోక్‌సభలో సోమవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి నుంచి ఆర్‌బీఐ మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపారు. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడీ, భవనం కూలిపోవడం, బ్యాంకు ఉద్యోగుల మోసం తదితర అంశాల్లో లాకరు వార్షిక అద్దెకు వందరెట్లను ఖాతాదారుకు బ్యాంకులు చెల్లించాలనే నిబంధన ఆర్‌బీఐ చేర్చిందని చెప్పారు.
ఏపీ రిసోర్సు గ్యాప్ రూ.4,117.89 కోట్లు చెల్లించాం
రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌కు రిసోర్స్ గ్యాప్ రూ.4,117.89 కోట్లు మాత్రమేనని, ఆ మొత్తాన్ని విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి చెప్పారు. 2014–15లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ రూ.22,949 కోట్లు ఉందా అని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు మంత్రి కాదని జవాబిచ్చారు. 2014–15లో 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,079 కోట్లు అని ఆంధ్రప్రదేశ్ తెలిపిందని చెప్పారు. 2014–15 ఏపీ, తెలంగాణల అకౌంటెంట్ జనరల్ ప్రచురించిన స్టేట్ ఫైనాన్స్ అకౌంట్స్‌లో ఆ కాలానికి రెవెన్యూలోటు రూ.13,775.76 కోట్లని తెలిపారు. నీతి ఆయోగ్ వాస్తవ అంచనా ప్రకారం కొత్త పథకాలపై వ్యయం, నెలవారీ పింఛను పెంపు ప్రభావంతో రూ.11,960.87 కోట్లు అనుమతించలేదన్నారు. 2013–14కి సంబంధించిన బకాయిలు రూ.91.27 కోట్లను 2014–15 రిసోర్సు గ్యాప్‌లో చేర్చినట్లు తెలిపారు. ఈ మేరకు 2014–15లో పేర్కొన్న కాలానికి రిసోర్సు గ్యాప్ రూ.4,117.89 కోట్లుగా తేలిందని, ఆమొత్తాన్ని రాష్ట్రానికి విడుదల చేశామని చెప్పారు. అనంతరం ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు డిస్కంలకు ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ బాండ్స్ నిమిత్తం రూ.1,500 కోట్లను ఈ ఏడాది మార్చి 21న విడుదల చేసినట్లు తెలిపారు.
7 పాలిటెక్నిక్ కళాశాలలు
ఆంధ్రప్రదేశ్‌లో 2017–18 నుంచి 2021–22 మధ్య ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జవాబిచ్చారు.
ఏనుగుల కదలికల గుర్తింపునకు డ్రోన్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల కదలికలు గుర్తించేందుకు డ్రోన్లు వినియోగించడానికి ప్రాజెక్టు ఎలిఫెంట్ కేంద్ర ప్రాయోజిత పథకం అమలు చేస్తున్నట్లు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే చెప్పారు. 2020–21లో రూ.4 లక్షలు, 2021–22లో రూ.3.5 లక్షలు డ్రోన్లు కొనుగోలుకు విడుదల చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు జవాబిచ్చారు.
ఈ–శ్రమ్ పోర్టల్‌లో 2.76 కోట్లమంది డొమెస్టిక్ వర్కర్లు నమోదు
ఈ–శ్రమ్ పోర్టల్‌లో దేశవ్యాప్తంగా 2.76 కోట్లమంది డొమెస్టిక్ వర్కర్లు నమోదు చేసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి ప్రశ్నకు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి సమాధానమిచ్చారు.
33 శాతం సంస్థలు సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు
ఆంధ్రప్రదేశ్‌లో 33 శాతం సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులు ఖర్చుచేసినట్లు సీఎస్‌ఆర్ డాటా విశ్లేషణలో తేలిందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు బి.వి.సత్యవతి, లావు శ్రీకృష్ణదేవరాయలు, బెల్లాన చంద్రశేఖర్, గొడ్డేటి మాధవి, మద్దిళ్ల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 2019–20లో రూ.710 కోట్లు, 2020–21లో రూ.662 కోట్లను సంస్థలు ఖర్చు చేశాయని చెప్పారు.
మూలధన వ్యయం నిమిత్తం ఏపీకి సాయం
మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు 2021–22లో రూ.501 కోట్లు, 2020–21లో రూ.688 కోట్లు ప్రత్యేక సాయంగా ఇచ్చినట్లు వైఎస్సార్‌సీపీ సభ్యులు మిథున్‌రెడ్డి, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు.
పెరుగుతున్న కార్మికుల సంఖ్య
అందుబాటులో ఉన్న డాటా ప్రకారం పదేళ్లుగా దేశంలో కార్మికుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మికశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిచ్చారు.
వెనకబడిన జిల్లాలకు రూ.1,750 కోట్లు విడుదల
ఏపీ విభజన చట్టాన్ని అనుసరించి నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు జిల్లాలకు రూ.1,750 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,049.34 కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వంగా గీతావిశ్వనాథ్, పి.వి.మిథున్‌రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు.
2022–23లో కేజీబీవీల కేటాయింపు లేదు
ఆంధ్రప్రదేశ్‌కు 2022–23లో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలను కేటాయించలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు బి.వి.సత్యవతి, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 499 కేజీబీవీలు ఉన్నాయని తెలిపారు. ఏపీ విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ప్రాధాన్యం ఉన్న పలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఐఐటీ–తిరుపతి, ఎన్‌ఐటీ–తాడేపల్లిగూడెం, ఐఐఎం–విశాఖపట్నం, ఐసెర్–తిరుపతి, కేంద్రీయ విశ్వవిద్యాలయం–అనంతపురం, పెట్రోలియం యూనివర్సిటీ–విశాఖపట్నం, వ్యవసాయ వర్సిటీ–గుంటూరు ఇప్పటికే కొనసాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు.
ఏపీ నుంచి నాబార్డుకు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రహదారుల అభివృద్ధి నిమిత్తం 2021–22, 2022–23ల్లో నాబార్డుకు ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కారద్ తెలిపారు. 2021–22లో గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని ఆరు రహదారులు ప్రతిపాదించగా రెండు రహదారులకు అనుమతి రాలేదని, 2022–23లో గుంటూరు జిల్లాలోని రహదారి ప్రతిపాదనలు కార్యాచరణ దశలో ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీలు బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఏపీలో యువకళాకారులకు ఉపకారవేతనాలు
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సాంస్కృతిక రంగాల్లోని యువ కళాకారులకు ‘స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌తోపాటు స్కాలర్‌షిప్–ఫెలోషిప్ పథకం ద్వారా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. 2019–20, 2020–21, 2021–22ల్లో రూ.55 కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్ ప్రశ్నకు జవాబిచ్చారు.
ఏపీలో 48 ఎస్‌హెచ్‌ఐలు
వొకేషనల్ విద్యలో శిక్షణ నిమిత్తం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 48 స్కిల్ హబ్స్ ఇనిషియేటివ్ (ఎస్‌హెచ్‌ఐ)లు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి ప్రశ్నకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి
Comments
Please login to add a commentAdd a comment