ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తాం
- 'హోదా'పై లోక్సభలో వైఎస్ఆర్ సీపీ ఎంపీల ఆందోళన.. స్పందించిన హోం మంత్రి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో లోక్‌సభలో నినదించడంతో రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన మంగళవారం సభలో ప్రకటించారు. ఈ విషయంలో ఆందోళన తగదని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.
అలాగే హైకోర్టు విభజన అంశంపై టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కూడా మాట్లాడారు. హైకోర్టు విభజనకు సంబంధించి న్యాయ శాఖ మంత్రితో మాట్లాడానని, ఆయన తగిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. అంతకు ముందుకు రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రద్యేకహోదా కల్పించాల్సిందేనని, ఆ మేరకు చర్చ చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం అందుకు అభ్యంతరం తెలుపుతూ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ఫ్లకార్డులు చేతబట్టిన వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు.
ఎంపీల ఆందోళనపై స్పందిచిన హోం మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఆంధ్రప్రదేశ్కు ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. 'తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం చేయబోం. కచ్చితంగా న్యాయమే చేస్తాం. హైకోర్టు ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడా దీనిని పర్యవేక్షిస్తున్నారు' అని రాజ్నాథ్ లోక్సభలో ప్రకటించారు.