2026లో అధికారం మాదే.. పళణిస్వామి ధీమా
సాక్షి, చెన్నై: జ్యోతిష్యం ఫలిస్తుందని, 2026లో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సేలంలో జరిగిన పార్టీ నేతల సమావేశానంతరం పళణిస్వామి మీడియాతో మాట్లాడారు. డీఎంకే కూటమిలో పొగచిచ్చుగా మారడం ఖాయం అన్నారు. 41 నెలల డీఎంకే పాలనలో నోరెత్తని కూటమి పారీ్టల నేతలు ఇప్పడు విమర్శలు గుప్పించడాన్ని ప్రతిఒక్కరూ పరిగణించాలన్నారు.
ఈ పరిణామం చీలిక కాదా అని ప్రశ్నించారు. పళని స్వామి జ్యోతిష్కుడు అయ్యాడని సీఎం వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వాస్తవమే జ్యోతిష్యం ఫలిస్తుందని 2026లో రాష్ట్రంలో అధికారం అన్నాడీఎంకే గుప్పెట్లోకే అని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే తమిళనాడు అవినీతిలో ముందంజలో ఉందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో యువత రావాలని, యువతను ఆకర్షించే కార్యక్రమాలు విస్తృతంచేయనున్నట్టు పేర్కొన్నారు.
పళణికి నోటీసులు..
పళణిస్వామికి మద్రాసు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో గతంలో సినీ నిర్మాత జాఫర్ సాధిక్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని డీఎంకేపై పళణిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరుకు కళంగం తెచ్చే విధంగా వ్యవహరించారని ఆయనపై డీఎంకే సీనియర్ నేత ఆర్‌ఎస్ భారతీ రూ.కోటి పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి టికారాం విచారించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పళణిస్వామికి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment