ఎన్నికలు నిర్వహించినంత పక్కా ప్రణాళికతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు యంత్రాంగాన్ని మూడు విభాగాలుగా విభజించింది. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీకి వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఉంటుంది. జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలో ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్‌పర్సన్లుగా ఉంటారు. జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంటుంది. దీనికి తహసీల్దార్ చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఇక్కడ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. – సాక్షి, హైదరాబాద్
ఒకే కంపెనీ టీకానే వేసుకోవాలి
వచ్చే నెలలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. అనేక కంపెనీలు టీకాలను తయారు చేస్తున్నాయి. కాబట్టి మన రాష్ట్రానికి ఏ కంపెనీ టీకా వస్తుందన్నది ఇంకా తెలియదు. టీకాను రెండు డోసుల్లో ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే వేర్వేరు కంపెనీలు టీకాలను పంపిణీ చేసినట్లయితే.. ఒక టీకాను ఒక డోసులో.. మరో టీకాను ఇంకో డోసులో తీసుకోవద్దు. మొదటి డోసును ఏ కంపెనీకి చెందిన టీకా తీసుకుంటే, రెండో డోసు కూడా అదే కంపెనీకి చెందిన టీకానే వేసుకోవాలి.
మరికొన్ని మార్గదర్శకాలు...
1. టీకాల పంపిణీలో సమస్యలు రాకుండా చూసుకోవాలి.
2. టీకా పంపిణీకి ప్రత్యేకంగా కోవిన్ యాప్
3. టీకా తీసుకునే ప్రతి వ్యక్తి సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. మొదటి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందికి టీకా
4. రాష్ట్ర, కేంద్ర పోలీసులు, సాయుధ దళాలు, హోం గా ర్డులు, సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్లు, విపత్తు నిర్వహణలో పనిచేసే సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి వేస్తారు.
5. 50 ఏళ్లు పైబడిన వారు, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి వేస్తారు.
6. టీకాను వేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ, మున్సిపల్ భవనాలను ఎంపిక చేస్తారు.
7. ప్రతి టీకా కేంద్రంలో 3 గదులు ఉండేలా ఏర్పాట్లు
8. టీకాలిచ్చే బృందంలో మొత్తం ఐదుగురు సభ్యులుంటారు. డాక్టర్ లేదా నర్సు, పోలీసు లేదా హోం గార్డు, ధ్రువపత్రాలను పరిశీలించేందుకు ఒకరు, భౌతిక దూరాన్నిపర్యవేక్షించేందుకు మరొకరు, టీకాల ప్రచారం లేదా ప్రజలు కేంద్రానికి వచ్చేలా చూసే వ్యక్తి ఉంటారు.
9. టీకా వేసిన తర్వాత దుష్ప్రభావాలు వస్తే తరలించేందుకు ముందుగానే ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
10. ప్రతి టీకా కేంద్రంలోనూ దుష్ప్రభావాలు వస్తే తక్షణమే చికిత్స చేసేందుకు ప్రత్యేక కిట్లు ఏర్పాటు చేయాలి.
11. టీకాలపై అపోహలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు మీడియాను భాగస్వాములను చేయాలి.
12. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకూ భాగస్వామ్యం చేయాలి.
13. వైద్య, ఆరోగ్య శాఖతో పాటు పోలీసు, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, విద్య తదితర ఇతర శాఖల సహకారం తీసుకోవాలి.
14. ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీలు, స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ తదితర సంఘాల సహకారాన్ని కూడా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment