న్యూఢిల్లీ: రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద ప్రత్యేక ఆర్థిక సహాయం చేసే పథకం కింద 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌కు 1,189.79 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.
కోవిడ్ మహమ్మారి వలన రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద సాయం చేయడానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
చదవండి: (ఏపీలో 12 సాగరమాల ప్రాజెక్ట్‌లు: కేంద్రమంత్రి)
ఈ విధంగా రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద కేంద్రం అందించే నిధులు 50 ఏళ్ళపాటు వడ్డీ లేని రుణాలుగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. మూలధన వ్యయం గుణాత్మకమైన ప్రభావం చూపుతుంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ ఉత్పాదన సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఫలితంగా ఆర్థిక ప్రగతి ఉన్నతంగా ఉంటుందని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment