సాక్షి, న్యూఢిల్లీ: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద పబ్లిక్, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.34.35 కోట్లు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎన్‌ఎస్‌డీఎఫ్)కు సమకూరినట్లు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిస్తూ.. క్రీడాకారులు, క్రీడాసంస్థలను ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ ఏటా అందించే నిధులకు అదనంగా సీఎస్‌ఆర్ కింద కూడా ఎన్‌ఎస్‌డీఎఫ్‌కు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఆర్ ద్వారా రూ.43.88 కోట్లు సమకూర్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడా విభాగాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మంత్రి చెప్పారు.
ఈ–శ్రమ్‌లో ఏపీ నుంచి 80 లక్షల మంది అసంఘటిత కార్మికులు
అసంఘటిత కార్మికుల వివరాలతో సమగ్రమైన జాతీయ డేటాబేస్ రూపొందించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ–శ్రమ్ పోర్టల్‌లో ఈ నెల 3వ తేదీకి ఆంధ్రప్రదేశ్ నుంచి 80,03,442 మంది పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. దేశవ్యాప్తంగా28,99,63,420 మంది అసంఘటిత కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని చెప్పారు.
పీఎం10 తగ్గింపు లక్ష్యం
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ)లో భాగంగా ఏపీలో నగరాలకు వార్షిక పర్టిక్యులేట్ మీటర్ (పీఎం10) తగ్గింపు లక్ష్యం విధించినట్లు కేంద్ర పర్యావరణశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌చౌబే తెలిపారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాలను ఎన్‌సీఏపీలో చేర్చామని, వాటికి 2022–23, 2023–24ల్లో నిధులు కేటాయించామని వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment