Drone Attack On Jammu Airport: భారత రక్షణ స్థావరంపై తొలి డ్రోన్‌ ఉగ్రదాడి - Sakshi
Sakshi News home page

Drone Attack On Jammu Airport: భారత రక్షణ స్థావరంపై తొలి డ్రోన్‌ ఉగ్రదాడి

Published Mon, Jun 28 2021 4:26 AM | Last Updated on Mon, Jun 28 2021 12:01 PM

Drone attack at Jammu air base - Sakshi

జమ్మూ: జమ్మూలోని భారత వైమానిక దళ (ఐఏఎఫ్‌) స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్‌ కేంద్రిత ఉగ్రవాదులు భారత కీలక రక్షణ స్థావరాలపై డ్రోన్‌ దాడికి తెగబడడం ఇదే తొలిసారి. జమ్మూ విమానాశ్రయంలోని ఐఏఎఫ్‌ స్టేషన్‌పై శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో రెండ బాంబులను జారవిడిచారు. ఈ బాంబు దాడిలో ఇద్దరు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారు. రాత్రి 1.40 గంటలకు ఆరు నిమిషాల వ్యవధిలో రెండు బాంబులను జారవిడిచారని అధికారులు తెలిపారు.

మొదటి బాంబు దాడిలో ఐఏఎఫ్‌ స్టేషన్‌ పై కప్పు ధ్వంసం కాగా, రెండో బాంబు నేలపై పడి పేలింది. జమ్మూ శివార్లలోని సత్వారీ ప్రాంతంలో ఉన్న విమానాశ్రయంలోని హై సెక్యూరిటీ ప్రాంతంలోని ఐఏఎఫ్‌ స్టేషన్‌పై ఈ దాడి జరిగింది. ఇది ఉగ్రదాడేనని జమ్మూ, కశ్మీర్‌ పోలీస్‌ చీఫ్‌ దిల్బాగ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. వైమానిక దళ అధికారులతో కలిసి దీనిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ–ఎన్‌ఐఏ) బృందం పరిశీలించింది.

ఆ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి?, ఏ మార్గంలో ప్రయాణించాయనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయంతో పాటు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, విమానాశ్రయం ప్రహారీ గోడపై ఉన్న కెమెరాలన్నీ మెయిన్‌ రోడ్డువైపే ఫోకస్‌ చేసి ఉన్నాయి. కాగా, శత్రు కదలికలను గుర్తించేందుకు సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన రాడార్‌ వ్యవస్థ డ్రోన్లను గుర్తించలేదని, డ్రోన్ల వంటి చిన్న వస్తువులను గుర్తించే ప్రత్యేక రాడార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.

బాంబులను జారవిడిచిన తరువాత డ్రోన్లు తిరిగి సరిహద్దు దాటి వెళ్లడమో, లేక మరో రహస్య ప్రదేశానికి వెళ్లడమో జరిగి ఉండవచ్చని  అంచనా వేస్తున్నారు. జమ్మూ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సరిహద్దు 14 కి.మీల దూరంలో ఉంది. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంలో రెండు స్వల్పస్థాయి పేలుళ్లు సంభవించాయని ఐఏఎఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ హెచ్‌ఎస్‌ అరోరా ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌  ఐఏఎఫ్‌ చీఫ్‌తో మాట్లాడారు.

జమ్మూ విమానాశ్రయం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వైమానిక దళ నియంత్రణలో ఉంటుంది. ఈ దాడి కారణంగా విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని అధికారులు తెలిపారు. ఈ దాడిపై  పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ– ఉపా), పేలుడు పదార్థాల చట్టం సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది.  మరోవైపు, మరో భారీ బాంబు దాడిని భద్రత అధికారులు అడ్డుకోగలిగారు. ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన వాడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 6 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. జనసమ్మర్ధం ఉన్న ప్రదేశంలో బాంబులను పేల్చే ఉద్దేశంతో  జమ్మూలోని బానిహాల్‌ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరో ముగ్గురి కూడా అరెస్ట్‌ చేశామని దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు.
 

జమ్మూలో మరో డ్రోన్‌ కలకలం
జమ్మూలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. కలుచక్ మిలటరీ స్టేషన్‌ వద్ద జవాన్లు మరో డ్రోన్‌ను గుర్తించినట్లు సమాచారం. డ్రోన్‌ను నిర్వీర్యం చేసే క్రమంలో జవాన్లు దానిపై  20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement