![Four family members ends life in Mysuru](/styles/webp/s3/article_images/2025/02/18/12454.jpg.webp?itok=YlrTs2Bg)
బాధపడుతున్న కుటుంబ సభ్యులు
కుటుంబం ఆత్మహత్య
భార్య, కొడుకు, తల్లికి విషం తాగించి..
తాను ఉరివేసుకుని బలవన్మరణం
మైసూరులో పెల్లుబికిన విషాదం
మైసూరు: వారసత్వ నగరి మైసూరులో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి కొడుకు, వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని విశ్వేశ్వరయ్య నగరలో ఉన్న సంకల్ప్ అపార్ట్‌మెంటులో ఈ విషాదం చోటుచేసుకుంది.
అంతా భయానకం
అపార్టుమెంటులో నివసిస్తున్న చేతన్ (45), రూపాలి (43) దంపతులు, వారి కొడుకు కుశాల్ (15), చేతన్ అమ్మ ప్రియంవద (65) మృతులు. మొదట చేతన్ తల్లి, భార్య, కుమారునికి ఏదో శక్తివంతమైన పురుగుల మందును తాగించడంతో వారు మరణించారు. తరువాత అతడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు అక్కడి దృశ్యాలను బట్టి చూస్తే ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాటులో తల్లీ కొడుకు మృతదేహాలు ఒకచోట, వృద్ధురాలి మృతదేహం మరోచోట ఉండగా, పై కప్పునకు చేతన్ మృతదేహం వేలాడుతున్న దృశ్యాలు నగరవాసులకు గగుర్పాటును కలిగించాయి. ఈ సామూహిక ఆత్మహత్యలు ఉదయం నుంచి తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి.
మేమే కారణం
విద్యారణ్యపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మొబైల్‌ఫోన్లు తదితరాలను స్వాదీనం చేసుకున్నారు. చేతన్ రాసిపెట్టిన డెత్‌నోట్ అక్కడ లభించింది. ఆర్థిక ఇబ్బందులే కారణం, మా చావుకు ఎవరూ కారణం కాదు, మేమే కారణం అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మా స్నేహితులను, బంధువులను ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు, మమ్మల్ని క్షమించాలి అని రాశారు.
సోదరునికి కాల్ చేసి
నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ ఆ ఫ్లాటును పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చేతన్ కార్మికులను సౌదీ అరేబియాకు పంపించే ఏజెన్సీ నడుపుతున్నాడు. చేతన్ కుటుంబం, తల్లి ప్రియంవద పక్క పక్క ఫ్లాట్లలో జీవిస్తున్నారు. ప్రతి ఆదివారం అందరూ కలిసి ఉండేవారు. హాసన్ జిల్లాలోని గోరూరు దేవాలయానికి వెళ్ళి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చారు. చేతన్ సొంతూరు గోరూరు, భార్య రూపాలి మైసూరువాసి. 2019 నుంచి మైసూరులో నివాసం ఉంటున్నారని కమిషనర్ తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు చేతన్ అమెరికాలో ఉన్న సోదరుడు భరత్‌కు ఫోన్ చేసి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామని, అందరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు. దీంతో భరత్ రూపాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చరించాడు. వారు చేతన్ ఫ్లాటుకు వచ్చి చూడగా అప్పటికే అందరూ ఆత్మహత్య చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులా, లేక ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా? అనేది సస్పెన్స్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment