బ్యాంక్‌ ఉద్యోగాలు.. ఆశావహులకు తీపికబురు | IBPS Recruitment 2021: Eligibility, Salary, Preparation, Selection Process | Sakshi
Sakshi News home page

పల్లె బ్యాంకుల్లో.. కొలువుల సందడి!

Published Fri, Jun 11 2021 3:15 PM | Last Updated on Fri, Jun 11 2021 5:58 PM

IBPS Recruitment 2021: Eligibility, Salary, Preparation, Selection Process - Sakshi

బ్యాంక్‌ ఉద్యోగాల ఆశావహులకు తీపికబురు. చాలాకాలం తర్వాత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో పదివేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ కెరీర్‌ సొంతం చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశం. ఈ నేపథ్యంలో ఐబీపీఎస్‌ బ్యాంకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియ.. ప్రిపరేషన్‌ గైడెన్స్‌పై కథనం...

పోస్టుల వివరాలు
► ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టే అటానస్‌ సంస్థ.. ఐబీపీఎస్‌. ఇది దేశవ్యాప్తంగా ఉన్న 43 రీజనల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో 10,473 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 5096 ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు, ఆఫీసర్‌ స్కేల్‌–1 పోస్టులు–4119, ఆఫీసర్‌ స్కేల్‌–2 జనరల్‌ బ్యాంకింగ్‌–906, ఆఫీసర్‌ స్కేల్‌–2 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–59, ఆఫీసర్‌ స్కేల్‌–2 చార్టర్డ్‌ అకౌంటెంట్‌–32, ఆఫీసర్‌ స్కేల్‌–2 లా ఆఫీసర్‌–27, ఆఫీసర్‌ స్కేల్‌ 2 – ట్రెజరీ మేనేజర్‌–10, ఆఫీసర్‌ స్కేల్‌ 2 మార్కెటింగ్‌ ఆఫీసర్‌–43, ఆఫీసర్‌ స్కేల్‌ 2 అగ్రికల్చర్‌ ఆఫీసర్‌–25, ఆఫీసర్‌ స్కేల్‌–3కి సంబంధించి 156 పోస్టులు ఉన్నాయి. 

► తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల వివరాలు: ఐబీపీఎస్‌ తాజా నోటిఫికేషన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఐదు బ్యాంకుల్లో మొత్తం 750 ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 343 ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 82 ఆఫీసర్‌ స్కేల్‌ –1 పోస్టులు, తెలంగాణలో 407 ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు, ఆఫీసర్‌స్కేల్‌1 పోస్టులు 89 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో పోస్టుల భర్తీ జరుగనుంది. 



అర్హతలు
► ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్థానిక భాషపై అవగాహన తప్పనిసరి. దాంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 

► ఆఫీసర్‌ స్కేల్‌1(అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. స్థానిక భాషపై అవగాహన తప్పనిసరి. దాంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

► ఆఫీసర్‌ స్కేల్‌–2(జనరల్‌ బ్యాంకింగ్‌) పోస్టుకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఆఫీసర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. 


► ఆఫీసర్‌ స్కేల్‌ 2(స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌)లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, చార్టర్డ్‌ అకౌంటెంట్, లా ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులను అనుసరించి ఎలక్ట్రానిక్స్‌/కమ్యూనికేషన్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫరేషన్‌ టెక్నాలజీ /సీఏ/లా /ఎంబీఏ/అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/డెయిరీ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ /ఫారెస్ట్రీ/వెటర్నరీ సైన్స్‌/అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌/పిసీ కల్చర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. 

► ఆఫీసర్‌ స్కేల్‌ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే... కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. వయసు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 
► రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎస్సీ/ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలు మూడేళ్లు వయో సడలింపు పొందొచ్చు. 
► విద్యార్హత ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. 

ఎంపిక విధానం
► ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌), ఆఫీసర్‌స్కేల్‌1 పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్ష ఉంటుంది. ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌లో అర్హత పొందిన వారికి మెయిన్‌ పరీక్ష నిర్వహించి.. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

► ఆఫీసర్‌ స్కేల్‌–1 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా  తుది ఎంపిక జరుగుతుంది. 

► ఆఫీసర్‌ స్కేల్‌ 2(జనరలిస్ట్, స్పెషలిస్ట్‌), ఆఫీసర్‌ స్కేల్‌ 3 పోస్టులకు సింగిల్‌ ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. సింగిల్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

ఆఫీస్‌ అసిస్టెంట్‌ పరీక్ష విధానం
► ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీ పర్పస్‌) ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు, న్యూమరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు– 40 మార్కులకు.. మొత్తంగా 80 ప్రశ్నలు–80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్‌ రాసేందుకు అనుమతి లభిస్తుంది. 

► ఆఫీస్‌ అసిస్టెంట్‌ మెయిన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు–50 మార్కులకు జరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

ఆఫీసర్‌ స్కేల్‌ 1 పరీక్ష విధానం 
► ఆఫీసర్‌ స్కేల్‌1 ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు– 40 మార్కులకు.. మొత్తంగా 80 ప్రశ్నలు–80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్‌కు అనుమతిస్తారు. 

► ఆఫీసర్‌ స్కేల్‌1 మెయిన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌æ 40 ప్రశ్నలు–50 మార్కులకు జరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో అర్హత సాధిస్తేనే ఇంటర్వ్యూ కాల్‌ వస్తుంది. మెయిన్‌ మార్కులతోపాటు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

ఆఫీసర్‌ స్కేల్‌ 2, 3 పరీక్ష విధానం
► ఆఫీసర్‌ స్కేల్‌ 2(జనరలిస్ట్, స్పెషలిస్ట్‌), ఆఫీసర్‌ స్కేల్‌ –3 పోస్టులకు సింగిల్‌ లెవెల్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. వీటిలో రీజనింగ్, కంప్యూటర్‌ నాలెడ్జ్, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ అండ్‌ డేటాఇంటర్‌ప్రిటేషన్‌ ఉమ్మడిగా ఉంటాయి. స్పెషలిస్ట్‌ పోస్టులకు మాత్రం ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ సబ్జెకు అదనంగా ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 

► ఆయా రాత పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కుల కోత విధిస్తారు. 


సిలబస్‌ అంశాలు
రీజనింగ్‌: అభ్యర్థులకు రీజనింగ్‌కు సంబంధించి కోడింగ్, డీకోడింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, పజిల్స్, ఇనీక్వాలిటీస్, ఆల్ఫాబెటికల్‌ సీక్వెన్సెస్, సిలాజిజమ్స్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్స్, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్స్, ఇన్‌పుట్‌ అవుట్‌పుట్స్‌ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. అధ్యయనంతోపాటు నిత్యం ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు లాజికల్‌ థింకింగ్‌ అప్రోచ్‌ను మెరుగుపరచుకోవాలి. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: బ్యాంకింగ్‌ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉన్న విభాగం ఇంగ్లిష్‌. ఇందులో గ్రామర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, సెంటెన్స్‌ కరెక్షన్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఏదైనా ఇంగ్లిష్‌ పత్రికను రోజూ చదువుతూ రీడింగ్‌ వేగం పెంచుకోవడంతోపాటు వొకాబ్యులరీని మెరుగుపరచుకోవచ్చు. 

జనరల్‌ అవేర్‌నెస్‌: ఇందులో ముఖ్యంగా కరెంట్‌ అఫైర్స్‌ సంబంధిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగంలో పరిణామాలు, మానిటరీ పాలసీ, రుణాలు, వడ్డీ రేట్లు, ఫైనాన్స్‌ రంగ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు జాతీయ, అంతర్జాయ అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇటీవల చర్చనీయాంశాలు, ముఖ్యమైన ఘటనలు, తేదీలు, వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం రోజూ దినపత్రికలు చదవడంతోపాటు టీవీ న్యూస్‌ను, చర్చాకార్యక్రమాలను అనుసరించొచ్చు. 



క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ: ప్రిలిమ్స్, మెయిన్‌ రెండింటిలో ఉండే ముఖ్యమైన టాపిక్‌ ఇది. బ్యాంకింగ్‌ పరీక్షలో అత్యంత నిర్ణయాత్మకం. ప్రిలిమ్స్‌తో పోలిస్తే మెయిన్‌లో ప్రశ్నలు కొంత క్లిష్టంగా ఉంటాయి. ఇందులో రాణించేందుకు అర్థ మెటిక్‌ అంశాలు, నంబర్‌ సిరీస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్‌ అంశాలను అధ్యయనం చేయాలి. చదవడంతోపాటు వేగంగా సమాధానం గుర్తించేలా ప్రాక్టీస్‌ చేయాలి. వేగం, కచ్చితత్వంతోనే ఇందులో మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. 


ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్షకు హాల్‌టికెట్లు: జులై/ఆగస్టు, 2021
► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు, 2021
► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: సెప్టెంబర్, 2021
► ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్షకు హాల్‌టికెట్లు: సెప్టెంబర్, 2021
► ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: సెప్టెంబర్‌/అక్టోబర్, 2021
► ఇంటర్వ్యూలు: అక్టోబర్‌/నవంబర్, 2021
► ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: జనవరి 2022
► వెబ్‌సైట్‌: http://www.ibps.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement