కాన్పూర్: భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకొనేందుకు రోజుల తరబడి వేచి ఉండనక్కర్లేదు. కేవలం 90 సెకన్లలో ఫలితం తెల్సుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకమైన పోర్టబుల్ టెస్టింగ్ పరికరాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ–కాన్పూర్ అభివృద్ధి చేసింది. ఈ పరీక్ష కోసం ఐదు గ్రాముల మట్టి చాలు. మొబైల్ యాప్ ద్వారా భూసారం తెలిసిపోతుంది. ‘భూ పరీక్షక్’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని ఐఐటీ–కాన్పూర్ తెలిపింది. పోర్టబుల్, వైర్‌లెస్ సాయిల్ టెస్టింగ్ పరికరం మట్టిలోని పోషకాలను కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ పరికరంలో 5 సెంటీమీటర్ల పొడవైన స్తూపాకర పాత్ర ఉంటుంది.
చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి’
ఇందులో 5 గ్రాముల పొడి మట్టిని ఉంచి, బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేయాలి. ఈ మట్టి నమూనాను పరికరం వేగంగా విశ్లేషిస్తుంది. అందులోని నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, కార్బన్ తదితర పోషకాలను గుర్తిస్తుంది. 90 సెకన్లలో సాయిల్ హెల్త్ రిపోర్టు స్క్రీన్‌పై కనిపిస్తుంది. సదరు భూమిలో ఏయే ఎరువులు ఎంత పరిమాణంలో చల్లాలో కూడా సూచిస్తుంది. ఈ పరికరం రైతులకు చక్కగా ఉపయోగపడుతుందని ఐఐటీ–కాన్పూర్ ప్రతినిధులు తెలిపారు.
ఒక్క పరికరంతో లక్ష దాకా నమూనాలను పరీక్షించవచ్చని అన్నారు. ఐఐటీ–కాన్పూర్‌లోని డిపార్ట్‌మెంట్ కెమికల్ ఇంజనీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్ జయంత్‌కుమార్ సింగ్, పల్లవ్ ప్రిన్స్, అషర్ అహ్మద్, యశస్వి ఖేమాని, మొహమ్మద్ అమిర్‌ఖాన్‌తో కూడిన బృందం ఈ ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ డివైన్‌ను అభివృద్ధి చేసింది. రైతులు భూసార పరీక్ష చేయించాలంటే నమూనాను సేకరించి, జిల్లా కేంద్రాల్లో ఉండే ల్యాబ్‌లకు పంపించాల్సి వస్తోంది. సాయిల్ హెల్త్ కార్డు కోసం కనీసం 15 రోజులపాటు ఎదురు చూడాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment