కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం! | KTR fires on Rahul Gandhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎం!

Published Wed, Nov 13 2024 6:29 AM | Last Updated on Wed, Nov 13 2024 6:29 AM

KTR fires on Rahul Gandhi

ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి తెలంగాణ నుంచే డబ్బు మూటలు: కేటీఆర్‌

మహారాష్ట్రలో రూ.300 కోట్లతో ఎన్నికల ప్రకటనలు  

తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ అంటూ స్వయంగా పీఎం మోదీనే చెప్పారు 

మీ కుంభకోణాలను దేశం ముందుకు తెచ్చేందుకు ఢిల్లీకి వచ్చా.. 

నేను హైదరాబాద్‌కు వస్తున్నా.. దమ్ముంటే ఏదైనా చేయండని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం రాహుల్‌ గాందీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడికి తెలంగాణ నుంచే డబ్బు మూటలు వెళ్తున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దుల్లో భద్రతను పెంచాలని, ఆన్‌లైన్‌ లావాదేవీలపై మరింత నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామన్నారు. పలు సందర్భాల్లో తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ కట్టాలంటూ వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి మోదీ.. సీఎం రేవంత్‌రెడ్డి అవినీతిపై చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు.

అమృత్‌ స్కీంలో జరిగిన స్కాంపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌తో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు ఈ స్కాంపై చర్యలు తీసుకోకపోతే తాము రాజ్యసభలో ఈ అంశాన్ని లెవనెత్తి దేశమంతా ఆలోచించేలా చేస్తామని కేంద్రమంత్రిని హెచ్చరించినట్లు చెప్పారు. మంగళవారం వసంత్‌విహార్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు సురేశ్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, మాజీ ఎంపీ బాల్క సుమన్, దాసోజు శ్రవణ్‌లతో కలిసి కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

కొడంగల్‌ వాసులకు విషం 
సొంత బావమరిది సృజన్‌రెడ్డికి అమృతం ఇచి్చన సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌ వాసులకు మాత్రం విషం ఇచ్చారని కేటీఆర్‌ మండిపడ్డారు. బావమరిది కంపెనీని అందలమెక్కించేందుకు రేవంత్‌ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రుణమాఫీ, రైతుబంధు, పింఛన్లు, తులం బంగారం, మహిళలకు రూ.2,500 ఇచ్చేందుకు డబ్బు లేదు కానీ.. మహారాష్ట్రలో మాత్రం రూ.300 కోట్లతో పేపర్‌ యాడ్స్‌ ఇచ్చారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అవినీతిపై వివరాలిచి్చనా కేంద్రం ఇప్పటివరకూ విచారణ జరపలేదని మండిపడ్డారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు ఎవరైనా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించారా అని నిలదీశారు. సీఎం హైదరాబాద్‌ను నాలుగు ముక్కలుగా చేసే కుట్రలో బీజేపీ ఎంపీలు మద్దతు పలుకుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి పెట్టుబడులు బీజేపీపాలిత రాష్ట్రాలకు తరలించాలన్నదే రేవంత్‌ ఎజెండా అని వ్యాఖ్యానించారు. 

రేవంత్‌ 26 సార్లు ఢిల్లీ వచ్చారు... 
11 నెలల్లో 26 సార్లు ఢిల్లీకి వచి్చన సీఎం రేవంత్‌ తెలంగాణకు రూ.26 పైసలు కూడా తీసుకురాలేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘నేను ఢిల్లీకి వస్తే మీకేం పని అని మంత్రి పొంగులేటి అంటున్నాడు. మీ కుంభకోణాలు, మీ చేతగాని పాలనను దేశ ప్రజల ముందుకు తెచ్చేందుకే ఢిల్లీకి వచ్చాను. పౌరసరఫరాల శాఖలో అవినీతి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కంపెనీల లీలలు కూడా బయటపెట్టేందుకు మళ్లీ మళ్లీ ఢిల్లీకి వస్తాను. నేను ఈ సమావేశం అనంతరం హైదరాబాద్‌కు వస్తా.. మీకు (కాంగ్రెస్‌ ప్రభుత్వానికి) దమ్ముంటే ఏదైనా చేయండి. ఎన్ని ఏజెన్సీలనైనా రప్పించుకోండి’అని కేటీఆర్‌ అన్నారు. 2–3 వారాల క్రితం కోహినూర్‌ హోటల్లో పొంగులేటి అదానీని రహస్యంగా కలిసి కాళ్లు పట్టుకున్నారా లేదా అని వ్యాఖ్యానించారు.  

కులగణన పేరుతో 75 ప్రశ్నలు  
కేసీఆర్‌ పేరు తలవనిదే ఒక్కరోజు కూడా సీఎం రేవంత్‌కు నిద్రపట్టదని కేటీఆర్‌ విమర్శించారు. ప్ర జలు కేసీఆర్‌ పేరు మర్చిపోతే సీఎంకు వచి్చన బా ధ ఏంటని ప్రశ్నించారు. కులగణనకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పేరుతో 75 ప్రశ్నలు వేయడమేంటని నిలదీశారు. ఎవరైనా కులం, మతం వివరాలు అడుగుతారని, కానీ.. మీ ఇంట్లో ఫ్రిజ్‌ ఉందా, టీవీ ఉందా, ఏసీ ఉందా అనే ప్రశ్నలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. అవి లేకపోతే నువ్వేమైనా కొనిస్తావా అంటూ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలను మేకలను కొన్నట్లు కొంటున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలను కూడా ఇలాగే కొన్నారనే విషయం మర్చిపోవద్దన్నారు.

పనికిరాని పాలనలో ఆగం
పసలేని, పనికిరాని పాగల్‌ పాలనలో తెలంగాణ ఆగమవుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘తెలంగాణ తల్లడిల్లుతూ తిరగబడుతోంది. కుటుంబ దాహం కోసం జరుగుతున్న కుట్రలపై లగచర్ల పోరాడుతోంది. మా భూములు మాకేనని కొడంగల్‌ కొట్లాడుతోంది. కుట్రలు, కుతంత్రపు పాలనలో జనం కోపం కట్టలు తెంచుకుంటోంది. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, హైడ్రా దౌర్జన్యాలు, మూసీలో ఇళ్ల కూల్చివేతలు ఇలా పలు అంశాలపై అనేక మంది ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల మహా ధర్నా, పెండింగ్‌ బకాయిల కోసం మాజీ సర్పంచ్‌ల నిరసన, పరీక్షల నిర్వహణపై విద్యార్థుల ఆగ్రహం, ఫార్మా పరిశ్రమలకు భూములు ఇవ్వమంటూ అన్నదాత కన్నెర్ర వంటి ఘటనలు రాష్ట్రంలో ప్రతీరోజు కనిపిస్తున్నాయి’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement