ప్రేమించిన వ్యక్తిని మనువాడితే తప్పేంటి? | Meet Kshama Bindu Who Was First Sologamy Trend Setter In India | Sakshi
Sakshi News home page

ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడా? అందులో తప్పేంటి?: ముందుగానే పెళ్లి చేసుకుంది

Published Thu, Jun 9 2022 5:45 PM | Last Updated on Thu, Jun 9 2022 5:47 PM

Meet Kshama Bindu Who Was First Sologamy Trend Setter In India - Sakshi

తనను తాను ప్రేమించుకోలేని వాళ్లు.. ఇతరుల మీద ఏం ప్రేమ చూపిస్తారు? కానీ, 23 ఏళ్ల వయసున్న ఆ యువతికి తనను తాను ప్రేమించుకోవడం.. తప్పైంది. ప్రేమ వరకైతే ఫర్వాలేదు.. ఏకంగా పెళ్లి వరకు వెళ్లిందామె. అందుకే విమర్శలు, ట్రోలింగ్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. తనను తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన అమ్మాయి.. ఊహించని ట్విస్టే ఇచ్చింది ఇప్పుడు.

పెళ్లి చేసుకోవడానికి ఓ వరుడు కావాలి. అంతేగానీ ఎవరికో భార్యగా ఉండాల్సిన అవసరం నాకైతే లేదు. ఆ వరుడిని నేనే ఐతే ఏంటి నష్టం? తనను తాను ప్రేమించుకోవాలని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు.. వివాహ బంధంతో ఒక్కటైతే ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నారో అర్థం కావడం లేదు? అంటూ ప్రశ్నిస్తోంది క్షమా బిందు. 

గుజరాత్‌ వడోదరాకు చెందిన 23 ఏళ్ల క్షమా బిందు.. దేశంలో తొలి సోలోగామీ ట్రెండ్‌కు తెర తీసింది. తనను తాను పెళ్లాడి.. తన మీద తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకునే ప్రయత్నం చేసిందామె. వాస్తవానికి జూన్‌ 11వ తేదీన ఆమె ఆలయంలో శాస్త్రోత్తంగా పురోహితుడి సమక్షంలో వివాహం చేసుకోవాలనుకుంది. ఈలోపు కొన్ని రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాలతో జూన్‌ 8న ఇంట్లోనే వివాహం చేసుకుంది ఆమె. 

సోలోగామీ ట్రెండ్‌.. క్షమా బిందు ద్వారా యావత్‌ దేశానికి పరిచయం అయ్యింది. మెహెందీ, హల్దీ ఫంక్షన్‌లతో దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్యే తనను తాను మనువాడింది ఆమె. తొలుత తటపటాయించిన తల్లిదండ్రుల వర్చువల్‌ ఆశీర్వాదంతోనే వివాహ వేడుకను ముగించేసుకుంది క్షమా.  ఆమె కాన్సెప్ట్‌ మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా,  వివాదం, విమర్శలు, ట్రోలింగ్‌ ఎదురైంది. ఆమె తీరును తప్పుబట్టారు ఎందరో. ఆఖరికి పెళ్లి జరిపించే పురోహితుడికి కూడా బెదిరింపులు వెళ్లాయి. ఈ క్రమంలో.. ఆమె ముందుగానే వివాహతంతు పూర్తి చేసుకుంది.   

వివాహం తర్వాత అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌ ద్వారా ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందరికీ కృతజ్ఞతలు.. నేను నమ్మిన విషయాన్ని నమ్మి, పోరాడేందుకు నాకు మద్దతు రూపంలో శక్తి ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని చెప్పిందామె. 

క్షమా అందరిలాంటి అమ్మాయి కాదు. దామన్‌(గుజరాత్‌)లో పుట్టి పెరిగి.. వడోదరాలో స్థిరపడింది. సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్‌ కంపెనీలో సీనియర్‌ రిక్రూటర్‌గా పని చేస్తోంది. ఫ్రీలాన్స్‌ మోడలింగ్‌తోనూ రాణిస్తోందామె. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇంజనీర్లు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి సరితా దుబే అహ్మదాబాద్‌లో ఉంటోంది. 

తన కోసం తాను బతకాలనే నిబద్ధత.. ఎలాంటి షరతులు లేని ప్రేమకు చిహ్నం నా ఈ స్వీయ-వివాహం. నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు. అలాగే.. నన్ను నేను ప్రేమిస్తున్నా. అందుకే ఈ పెళ్లి అని చెప్తోంది క్షమా బిందు. అభ్యంతరాలు ఉన్న వాళ్లకు సమాధానం ఇచ్చే ముందు.. తామంటే తాము ఇష్టం లేదని ఒప్పుకుంటారా? అని ప్రశ్నిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement