కేంద్ర మంత్రి నిర్వాకం.. బతికున్న సైనికుడికి సంతాపం | Minister Narayanaswamy Lands In Wrong Soldiers House To Pay Respects | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి నిర్వాకం.. బతికున్న సైనికుడికి సంతాపం

Published Sun, Aug 22 2021 3:01 AM | Last Updated on Sun, Aug 22 2021 9:37 AM

Minister Narayanaswamy Lands In Wrong Soldiers House To Pay Respects - Sakshi

బెంగళూరు: మరణించిన సైనికుడి కుటుంబాన్ని పరామర్శించాల్సిన కేంద్ర మంత్రి.. విధులు నిర్వర్తిస్తున్న సైనికుడి ఇంటికి వెళ్లి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికో ఉద్యోగం, భూమి ఇప్పిస్తామంటూ వాగ్దానం చేశారు. దీంతో ఆ కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. తీవ్ర ఆందోళనకు గురై అప్పటికప్పుడు ఆ సైనికుడితో మాట్లాడి ఊరట చెందారు. ఈ ఘటన గురువారం కర్ణాటకలోని గదగ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

బీజేపీ చేపట్టిన జన్‌–ఆశీర్వాద్‌ యాత్రలో భాగంగా మూలగుంద్‌లో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి గత ఏడాది మృతి చెందిన బసవరాజ్‌ హిరేమఠ్‌ అనే సైనికుడి ఇంటికి వెళ్లి, పరామర్శించాల్సి ఉంది. కానీ, స్థానిక నేతలు ఆయన్ను ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్‌ కట్టిమణి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న మంత్రి ఆ సైనికుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఒకరికి ఉద్యోగంతోపాటు, భూమి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీతో రవికుమార్‌ కుటుంబసభ్యులు నోరెళ్లబెట్టారు. తమ కుమారుడు డ్యూటీలోనే ఉన్నారని వారు చెప్పారు. స్థానిక నాయకుడొకరు అప్పటికప్పుడు రవికుమార్‌కు వీడియో కాల్‌ చేశారు.

పొరపాటు గ్రహించిన మంత్రి నారాయణ స్వామి రవికుమార్‌తో మాట్లాడి, ఆయన సేవలను కొనియాడారు. కుటుంబసభ్యులకు సర్ది చెప్పి, అక్కడి నుంచి బయటపడ్డారు. తప్పుడు సమాచారం ఇచ్చిన బీజేపీ నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘మాకు పెళ్లయి రెండు నెలలే అయింది. నా భర్త కశ్మీర్‌లో పనిచేస్తున్నారు. మంత్రి వచ్చి మా యోగక్షేమాలు అడిగే సరికి మాకేమీ అర్థం కాలేదు. సరిహద్దుల్లో పనిచేసే సైనికుల కుటుంబాలను ఇలా కూడా గౌరవిస్తారు కాబోలని భావించాం. కానీ, ఆయన మా కుటుంబానికి ఉద్యోగం, భూమి ఇస్తామనే సరికి అనుమానం వచ్చింది. వెంటనే నా భర్తతో మాట్లాడాకే మనస్సు కుదుటపడింది’అని రవికుమార్‌ భార్య మీడియాతో అన్నారు. మంత్రి రాకతో తమతోపాటు, తన భర్త కూడా అనవసరంగా కంగారు పడాల్సి వచ్చిందని చెప్పారు. కాగా, షెడ్యూల్‌ ప్రకారం హిరేమఠ్‌ ఇంటికి వెళ్లకుండానే మంత్రి అక్కడి నుంచి మరో చోటికి వెళ్లిపోయారు. ‘మా ఇంటికి ఎవరూ రాలేదు. బతికున్న సైనికుడి ఇంటికి మంత్రి వెళ్లినట్లు తెలిసింది. మా కుమారుడిని మాకు తెచ్చివ్వండి’అని హిరేమఠ్‌ తల్లి ఉద్వేగంతో అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement