భోపాల్: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మైనర్‌పై లైంగికదాడి ఘటన దేశాన్ని విస్మయానికి గురి చేసింది. దారుణంగా లైంగికదాడికి గురవ్వడం ఒకటైతే.. నెత్తురుతో వీధివీధి తిరిగినా ఆమెకు ఎవరూ సాయం అందించకపోవడం దుర్మార్గమనే కోణంలో చర్చ నడిచింది. అయితే.. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపితం అయ్యిందిప్పుడు. ఆ బాలిక తల్లిదండ్రులు ముందుకు రానిపక్షంలో తాను దత్తత తీసుకుంటానని ఓ పోలీసాయన ముందుకు వచ్చారు.
ఈ ఘటనలో ఓ పూజారి బాధితురాలిని గుర్తించి.. ఆమెకు దుస్తులు ఇవ్వడంతో పాటు ఆస్పత్రికి తరలించి మరీ పోలీసులకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆస్పత్రిలో ఆమెకు ఇద్దరు పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారన్నది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. ఆమె కోలుకునేంత వరకు చికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు ఆమె చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానంటూ ఓ పోలీస్ అధికారి ముందుకు వచ్చారు.
ఉజ్జయిని మహాకాల్ ఇన్‌స్పెక్టర్ అజయ్ వర్మ పెద్ద మనసు చాటుకున్నారు. ఆమెని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చే క్రమంలో విఫలమైతే.. ఆమెను తాను దత్తత తీసుకుంటానని ముందుకొచ్చారు. ఆస్పత్రిలో ఆ చిన్నారి బాధతో ఏడ్చిన ఏడ్పు తనను కదిలించిందని అంటున్నారాయన. ఆ కేకలు తనతో కన్నీళ్లు పెట్టించాయని, దేవుడు ఇంత చిన్న వయసులో ఆమెకు ఇంత కష్టం ఎందుకు ఇచ్చాడా? అనిపించిందని అంటున్నారాయన.
కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ముందుకు రావట్లేదేమో అనిపిస్తోంది. వాళ్లు ముందుకు వస్తే.. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా. ఒకవేళ ఆమె కుటుంబం ముందుకు రానిపక్షంలో.. నేనే ఆమెను లీగల్‌గా దత్తత తీసుకుని పెంచుకుంటా అని ఇన్‌స్పెక్టర్ వర్మ అంటున్నారు.
జరిగింది ఇదే..
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు.
ధైర్యం చెప్పా…
‘రక్తమోడుతూ సాయం కోసం అర్థిస్తున్న బాలికను ఆశ్రమం వద్ద చూశా. మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. ఆమె కళ్లు వాచిపోయాయి. నీకేం కాదని ధైర్యం చెప్పా. కొత్త వాళ్లను చూడగానే ఆమె నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది. బాలిక ఏదో చెప్పింది. కానీ నాకు అర్థం కాలేదు. పెన్ను, పేపర్ అందించినా ఏమీ రాయలేదు. దుస్తులు అందించి పోలీసులకు సమాచారం ఇచ్చాను’ అని ఆయన తెలిపారు.
ప్రధాన నిందితుడి అరెస్టు?
లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్న బాలికపై అతడు అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వద్ద నుంచి బాలిక దుస్తుల్ని రికవరీ చేసినట్టు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం సంపాదించినట్టు పోలీసులు తెలిపారు. తప్పించుకునేందకు ప్రయత్నించిన అతన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment