సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం వృక్షాలను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత వృక్ష జాతిగా, అరుదైన చెట్లున్న ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతుల అంతర్జాతీయ వాణిజ్య ఒడంబడిక జాబితాలో ఎర్రచందనాన్ని చేర్చిన కారణంగా ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుందని చెప్పారు.
కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్‌డేంజరస్ స్పీసెస్ (సెట్స్) స్టాండింగ్ కమిటీ ఎర్రచందనాన్ని ముఖ్యమైన వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించాలని సూచించిందన్నారు. గ్రామీణ ప్రజలు, చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి, ఆదాయ మార్గాల సృష్టి, ఉత్పాదకత మెరుగుపరచడానికి పరిపూర్ణమైన, సమగ్ర పద్ధతిలో చెట్ల పెంపకాన్ని విస్తరించే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఆగ్రో ఫారెస్ట్రీలో భాగంగా ఎర్రచందనం, టేకు వంటి వృక్ష జాతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
పులికాట్ సరస్సు నిర్వహణకు ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సు సహా చిత్తడి నేలల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (ఐఎంపీ) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు మంత్రి అశ్వినికుమార్ చౌబే తెలిపారు. రాయదొరువు వద్ద సరస్సు ప్రవేశద్వారం నీటి ప్రవాహాన్ని అధ్యయనం చేయడంతోపాటు, ఇతరత్రా రక్షణ చర్యలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయని వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు.
ఆ న్యాయమూర్తుల వివరాలు ప్రత్యేకంగా లేవు
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అందువల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల వివరాలేమీ ప్రత్యేకంగా నిర్వహించడం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment