ఢిల్లీ: పంట వ్యర్థాల దహనాలపై ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రతిఏటా దేశ రాజధానిని కాలుష్య కాసారంగా తయారుచేయడం సరికాదని తెలిపింది. పీల్చే గాలిని కలుషితం చేయడం ప్రజలను హత్య చేయడమేనని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఇది మీకు ఏం పట్టదా..? అని ప్రశ్నించింది. ఈ సమస్యపై చర్చించడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు సమావేశం నిర్వహించాలని కోరింది. శుక్రవారం నాటికి ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలని గడువు విధించింది.
"పంజాబ్, హర్యానా సహా పొరుగురాష్ట్రాల్లో పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరగడానికి ప్రధాన కారణం. పంట వ్యర్థాలు కాల్చడం ఆపేందుకు చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎలా నిలిపివేస్తారో మాకు తెలియదు. అది మీ పని. ఢిల్లీ కాలుష్యం తగ్గేందుకు వెంటనే ఏదో ఒకటి చేయండి" అని కోర్టు ఆదేశించింది.
ఢిల్లీ వాయు కాలుష్యం రాజకీయ చర్చ కారాదని జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కాలుష్యంతో పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 20-50 రోజులు మాత్రమే తమ రాష్ట్రంలో పంట వ్యర్థాల కాల్చివేతలు ఉంటాయని పంజాబ్ అటార్ని జనరల్ తెలిపిన క్రమంలో ఇది అదే సమయమని తెలిపిన జస్టిస్ కౌల్.. కాలుష్యంపై అలసత్వం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బలవంతంగానైనా, ప్రోత్సాహకాల ద్వారానైనా పంట వ్యర్థాల కాల్చివేతలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు.
కాలుష్యానికి వాహనాలు కూడా ప్రధాన కారణం అవుతున్నందున.. ఢిల్లీలోకి వెహికిల్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని జస్టిస్ కౌల్ ధర్మాసనం కోరింది. పంట వ్యర్థాల కాల్చివేతలపై స్పందిస్తూ.. పంట మార్పిడి విధానాలను అనుసరించాలని సూచించింది. ఏదేమైనా ఈ అంశంపై ఓర్పు వహించే అవకాశమే లేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Delhi Air Pollution Updates: ఢిల్లీలో మళ్లీ సరి–బేసి విధానం
Comments
Please login to add a commentAdd a comment