ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారని గడ్కరి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆరోపించారు. దీంతో, ఆయన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
కాగా, నితిన్ గడ్కరీ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. అధికార పార్టీతో అంటకాగాలని చూసే వారే అధికమని అన్నారు. అవకాశవాదులే ఎక్కువ మంది ఉన్నారు. సిద్ధాంతాల భూమిక లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా సరే.. మంచి పనిచేసేవాడికి గౌరవం లభించదని, చెడ్డ పనిచేసే వారికి శిక్ష పడదని తానెప్పుడూ సరదాగా చెప్పేవాడినని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే, ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నారనేది మాత్రం వెల్లడించలేదు.
పబ్లిసిటీ, పాపులారిటీ చాలా అవసరం
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రధాని నరేంద్ర మోదీ మాటల్లో చెప్పాలంటే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని గడ్కరీ అన్నారు. ఈ ప్రత్యేకత కారణంగానే, మన ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు.. కానీ వారి వారి నియోజకవర్గాల ప్రజల కోసం వాళ్లు చేసిన పనులే అంతిమంగా ముఖ్యమైనవి, వారికి గౌరవం తెస్తాయి. పబ్లిసిటీ, పాపులారిటీ చాలా అవసరం. అయితే.. పార్లమెంట్‌లో ఏం మాట్లాడతారో దానికంటే తమ నియోజకవర్గాల్లో ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నారనేదే ముఖ్యమని కామెంట్స్ చేశారు.
లాలూ, ఫెర్నాండెజ్‌పై ప్రశంసలు..
ఇదే సమయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని ప్రశంసించిన గడ్కరీ, మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ప్రవర్తన, సరళత, వ్యక్తిత్వం నుంచి కూడా చాలా నేర్చుకున్నానని చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత నన్ను ఎంతగానో ఆకట్టుకున్న వ్యక్తి జార్జ్ ఫెర్నాండెజ్ అని ఆయన అన్నారు. ఇటీవలే మరణానంతరం భారతరత్న ప్రదానం చేసిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ను కూడా గడ్కరీ ప్రశంసించారు. అలాంటి వ్యక్తులు దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, అతను (ఠాకూర్) ఆటో రిక్షాలో ప్రయాణించాడు. అతని జీవనశైలి చాలా సాధారణమైనది అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment