డెహ్రాడూన్: భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ వణికిపోతోంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న వరద బీభత్సానికి ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. నైనిటాల్, ఇతర ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు, ఇళ్లు కొట్టుకుని పోయాయి. రైల్వే పట్టాలు, రహదారులు, వీధుల్లోకి వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.
కుండపోత వర్షాల కారణంగా నైటిటాల్‌తో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగి పడుతుండటంతో ఈ పర్యాటక ప్రాంతానికి వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. నైనీ సరస్సు పొంగిపొర్లుతున్న వీడియాలో సోషల్ మీడియాలో పోటెత్తాయి. నైనిటాల్ జిల్లాలోని రామ్‌గఢ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చని నైనిటాల్ ఎస్‌ఎస్‌పీ ప్రియదర్శిని మీడియాకు తెలిపారు.
కోసి నది నుంచి వరద పోటెత్తడంతో రాంనగర్-రాణిఖేట్ మార్గంలో లెమన్ ట్రీ రిసార్ట్‌లో సుమారు 200 మంది చిక్కుకున్నారు. పోలీసుల సహాయంతో వీరిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు సైనిక హైలికాప్టర్ల సాయంతో వరద బాధితులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. (భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment