
మూడురోజులపాటు ఉత్సవాలు..
భక్తుల కొంగు బంగారం కోదండ రామాలయం
డిచ్‌పల్లి: జిల్లాలోనే చారిత్రక ఆలయమైన డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. కాకతీయుల కాలం నాటి అపురూప శిల్పకళా నిలయంగా ఉన్న రామాలయానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమంత సేవ, ఆదివారం ఉదయం 11 గంటలకు శ్రీరాముని జననం, 12.01 గంటలకు శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణం, రాత్రి 7 గంటలకు స్వామి వారికి అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి 7 గంటలకు హనుమంతుని సేవతో నవమి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ చైర్మన్ శాంతయ్య, ప్రధానార్చకులు సుమిత్ శర్మ దేశ్‌పాండే తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ధర్మకర్త గజవాడ రాందాస్‌గుప్తా కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
బోధన్‌టౌన్(బోధన్): జిల్లా కేంద్రానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న బోధన్‌లోని శక్కర్‌నగర్ కోదండ రామాలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని 1951లో నిర్మించారు. పాలరాతిపై చెక్కిన సీతారామ లక్ష్మణ విగ్రహాలను అప్పట్లో ప్రతిష్టించారు. 74 యేళ్ళు గడుస్తున్నా దేవతా మూర్తుల పాలరాత్రి విగ్రహాలు వన్నె తగ్గకపోవడం విశేషం. ఆలయప్రాంగణం 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కలియుగ వైకుంఠమైన భద్రాద్రిలో నిర్వహించే రాములోరి పెళ్లిలాగే ఇక్కడ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణుల దేవతా విగ్రహాలు పశ్చిమాభిముఖంలో ఉండటం కారణంగా రెండో భద్రాద్రిగా ప్రఖ్యాతిపొందింది. ప్రతియేటా శ్రీరామనవమి ఉత్సవాలను వారంరోజులపాటు నిర్వహిస్తారు. ఆదివారం రాములోరి కల్యాణోత్సవం, సోమవారం పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

మూడురోజులపాటు ఉత్సవాలు..