
జల్సాలకు అలవాటుపడి చోరీలు
ఖలీల్‌శాడి: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలోని పరుశు దేవానందం ఇంట్లో ఇటీవల చోరీ జరగగా, బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామన్నారు. మాదాపూర్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఇతర ఆధారాలతో మాణిక్‌బండార్(చెక్క) వద్ద అనుమానాస్పందంగా తిరుగుతున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కార్లకు చెందిన నాందేవ్ ఆనందరావు ముండాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
విచారణ అనంతరం పరుశు దేవానందం ఇంట్లో చోరీకి పాల్పడినట్లు నాందేవ్ ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడి నుంచి 65 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుడు గతంలో నందిపేట్ పీఎస్ పరిధిలోని ఐలాపూర్, వెల్మల్ గ్రామాల్లో దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. వెల్మల్‌లో శ్రీనివాస్, అయిలాపూర్‌లో సందీప్ అనే వ్యక్తులతో కలిసి చోరీకి పాల్పడగా, అందుకు సంబంధించి 26 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీనివాస్, సందీప్‌లు గతంలోనే అరెస్టయినట్లు పేర్కొన్నారు. కాగా, నిందితుడు నాందేవ్ జక్రాన్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి ఆరునెలల క్రితం జైలుకు వెళ్లి మార్చి నెలలో బెయిల్‌పై వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 3న మాదాపూర్‌లో దొంగతనం చేసినట్లు చెప్పారు. మొత్తం 91 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని, నిందితుడు నాందేవ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. 48 గంటల్లోనే కేసును ఛేదించిన నార్త్ సీఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, సిబ్బందిని అభినందించారు.
నిందితుడి అరెస్ట్..బంగారం స్వాధీనం
ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి