
నల్లమడుగులో క్షుద్ర పూజల కలకలం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజల కలకలం రేపింది. పాఠశాలకు శని, ఆదివారాలు సెలవులు రావడంతో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోని ఓ గది వద్ద ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అరటిపండ్లు, నిమ్మకాయలతో పట్టు వేసినట్లు బొమ్మలను వేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు, కార్యదర్శి, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలతో చర్చించి లింగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు హెచ్‌ఎం కోటేశ్వర్‌రావు తెలిపారు.
రెండు స్కూల్ బస్సులు ఢీ: తప్పిన పెను ప్రమాదం
మోపాల్: మండలంలోని కులాస్‌పూర్ తండా శివారులో సోమవారం ఉదయం రెండు స్కూల్ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. కంజర్ గ్రామంలోని శ్రీసాయి విద్యానికేతన్ బస్సు, డిచ్‌పల్లి మండలంలోని వివేకానంద స్కూల్ బస్సు సోమవారం పిల్లలను తీసుకొచ్చేందుకు వెళ్లగా, కులాస్‌పూర్ తండా వద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. స్వల్ప ప్రమాదం చోటుచేసుకుందని, బస్సులో పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడంతో రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇదేవిషయమై ఎస్‌ఐ యాదగిరి గౌడ్‌ను వివరణ కోరగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని కాటేపల్లి గ్రామ శివారు మీదుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై మహేందర్ సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను తహసీల్దార్ దశరథ్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్
బాన్సువాడ: బీర్కూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల– హాస్టల్ నుంచి 8వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు ప్రిన్సిపాల్ శివకుమార్ తెలిపారు. ఈమేరకు అతడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి స్నేహితులను విచారించగా సదరు విద్యార్థులు కిష్టాపూర్‌లో యూనిఫామ్ మార్చుకుని గౌరారం గ్రామంలోని తోటి స్నేహితుడి దగ్గరకు వెళ్లినట్లు తెలిపారు. ఆ గ్రామం పరిసర ప్రాంతంలో వెతుకగా వారి ఆచూకీ దొరకలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నల్లమడుగులో క్షుద్ర పూజల కలకలం