
ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి
ధర్పల్లి: అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంతోపాటు హోన్నాజిపేట్ లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. తూకం యంత్రాలు, గన్నీ బ్యాగులు, ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపునకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. రైస్ మిల్లుల్లో వెంటవెంటనే అన్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు . జిల్లా వ్యాప్తంగా 700కుపైగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతున్నామని, 250 వరకు కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీసీవో శ్రీనివాసరావు, డీఎస్‌వో అరవింద్, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ మాలతి, ఎంపీడీవో బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
రైస్‌మిల్లుల్లో వెంటవెంటనే
అన్‌లోడ్ చేయాలి
రైతులకు ఇబ్బందులు
కలగకుండా చర్యలు
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు