
అకాల వర్షంతో ఆగమాగం
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. మధ్యా హ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. అకాల వర్షం భయంతో రైతులంతా కల్లాలకు పరుగులు తీశారు. ఆరబోసిన వడ్లు తడవకుండా కుప్పలపై టర్పాలిన్లు కప్పారు. బోధన్, సాలూర, పొతంగల్, రెంజల్, నవీపేట్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. బలమైన గాలులకు టార్పాలిన్లు ఎగిరిపోయాయి.
బోధన్: బోధన్, సాలూర మండలాల్లో చిరుజల్లులకు కురిశాయి. దీంతో ధాన్యం స్వల్పంగా తడిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని కుప్పులుగా పోసి, టార్పాలిన్లు కప్పేందుకు అవస్థలు పడ్డారు.
ఎడపల్లి(బోధన్) : ఎడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. వేగంగా వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షంతో అనేకచోట్ల ధాన్యం తడిసిపోయింది.
రెంజల్(బోధన్) : రెంజల్ మండలంలో అరగంటపాటు వాన దంచికొట్టింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం రాశుల చుట్టూ చేరిన నీటిని తొలగించేందుకు రైతులు ఇబ్బందిపడ్డారు. నీలా గ్రామంలో వడగళ్ల వర్షం కురిసింది.
బాల్కొండ : ముప్కాల్ మండల పరిధిలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయ్యింది. గాలి వాన బీభత్సానికి రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసింది.
బోధన్, బాల్కొండ, ఆర్మూర్
నియోజకవర్గాల్లో తడిసిన ధాన్యం
కల్లాలకు పరుగులు తీసిన రైతులు