
శోభాయాత్రకు సర్వం సిద్ధం
ఖలీల్‌వాడి: హనుమాన్ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమయ్యింది. ఏటా నిర్వహించే భారీ శోభాయాత్రకు ఇందూరు నగరం ముస్తాబైంది. బజరంగ్‌దళ్, హిందూవాహిని ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు కంఠేశ్వర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర రాత్రి 10 గంటలకు ఆర్‌ఆర్ చౌరస్తాకు చేరుకుంటుంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన హనుమాన్ శోభాయాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీకి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా దారిమళ్లింపు చేపట్టారు.
శోభాయాత్రకు 15 ఏళ్లు..
నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్రను 2009లో ప్రారంభించారు. మొదట 25 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనగా, ఏటా పెరుగుతూ వస్తోంది. గతేడాది 1.50 లక్షల మంది భక్తులు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈసారి 2 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సంస్థలు అంచనా వేస్తున్నాయి.
1300 మంది పోలీసులతో బందోబస్తు
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో శనివారం నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించా లని సీపీ సాయి చైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1300 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో జరిగే హనుమాన్ శోభాయాత్రను సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పుకార్లను నమ్మొద్దని పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు.
నేడు ఇందూరులో హనుమాన్
జయంతి ర్యాలీ
రెండు లక్షల మంది భక్తులు
పాల్గొనే అవకాశం
పోలీసుల భారీ బందోబస్తు