
పూలే జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
తెయూ(డిచ్‌పల్లి): నేటి యువత మహాత్మా జ్యోతి బాపూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి మాంధాత సీతారామమూర్తి పిలుపునిచ్చారు. తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జ్యోతి బాపూలే జయంతి సందర్భంగా తెయూ బీసీ సెల్ డైరెక్టర్ సీహెచ్ ఆరతి అధ్యక్షతన ‘భారతదేశ సామాజిక సమ్మిళిత అభివృద్ధిలో పూలే పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పూలే 1873లో సత్యశోధక్ సమాజ్ స్థాపించి సమానత్వ సమాజం కోసం పోరాడారన్నారు. తెయూ రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చరిత్రను చదవడం కాదు.. చరిత్రను సృష్టించాలన్నారు. రిసోర్స్ పర్సన్ సీహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ.. భారతదేశంలో మహిళల విద్యకు అడ్డంకులను తొలగించడానికి పోరాడిన మహనీయుడన్నారు. పీఆర్‌వో పున్నయ్య, ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, అధ్యాపకులు స్వప్న, నీలిమ ప్రసంగించారు. అనంతరం సీతారామమూర్తిని, రిజిస్ట్రార్ యాదగిరి, సదస్సు నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పూలే జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి