
16 నుంచి ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www. telangana university.ac.inను సందర్శించాలని ఆయన సూచించారు.
23 నుంచి
ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (ఏపీఈ, ఐఎంబీఏ, ఐపీసీహెచ్) 6, 8, 10వ సెమిస్టర్ థియరీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాల తనిఖీ
నవీపేట: మండలంలోని నవీపేట, నాగేపూర్, బినోల, నిజాంపూర్, నాళేశ్వర్ గ్రామాలలో సొసైటీలు, ఐకేపీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. హమాలీ, గన్నీ బ్యాగ్, లారీల కొరత తదితర సమస్యలను రైతులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో తూకం చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపాలని సూచించారు. డీసీవో శ్రీనివాస్‌రావు ఉన్నారు.
మున్సిపల్ సిబ్బంది
హక్కులను హరించొద్దు
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సెలవు రోజుల్లో కూడా సిబ్బందితో పనిచేయిస్తూ వారి హక్కులను హరిస్తున్నారని మానవ హక్కుల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానవ హక్కుల నాయకుడు పులి జైపాల్ మాట్లాడుతూ బల్దియాలో పన్నుల వసూళ్ల పేరిట కార్మికులు, సిబ్బందిని సెలవు రోజుల్లో సైతం పనులు చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. నెలంతా పనులు చేయించుకుంటూ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్నారు. ఇకనైనా అధికారులు లేబర్ చట్టాలను గౌరవించాలన్నారు. సమావేశంలో నాయకులు జగన్, నీలగిరి రాజు, మల్లాని శివ తదితరులు పాల్గొన్నారు.