
అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించింది
నిజామాబాద్ సిటీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుని మానసికంగా హింసించిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుద్ధిచేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ చావుకు మొట్టమొదటి కారణం కాంగ్రెస్సేనని, ఆయనను రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓడించిందని ఆరోపించారు. బీజేపీ ఒత్తిడితోనే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చారన్నారు. అంబేడ్కర్ పేరుతో కాంగ్రెస్ ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. అంబేడ్కర్ పుట్టిన స్థలం, చదువుకున్న స్థలం, దీక్షతీసుకున్న స్థలం, మరణించిన స్థలాన్ని పంచతీర్థాలుగా మార్చి పర్యాటక ప్రాంతంగా ప్రధాని నరేంద్రమోడీ మార్చారని గుర్తుచేశారు.
పవన్‌ను విమర్శించడం తగదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్సీ కవిత విమర్శించడం తగదని అర్వింద్ అన్నారు. రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు ఎంతో ఫేమ్ ఉందని, సినిమాల్లో వచ్చే సంపాదనను పక్కనపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. కవిత ఎలా ఫేమ్ అయ్యారని ప్రశ్నించారు. సంచులు మోసే సంస్కృతి కవిత, రేవంత్‌రెడ్డిలదేనని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ ఒత్తిడితోనే భారతరత్న
ఎంపీ ధర్మపురి అర్వింద్