
తీరనున్న గల్ఫ్ కార్మికుల ఆశలు!
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ వలస కార్మికుల ఆశలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమగ్ర ప్రవాసీ విధానానికి రూపకల్పన చేసి తద్వారా గల్ఫ్ బోర్డుకు అంకురార్పణ చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది. గల్ఫ్ వలసదారుల ఆశలను సజీవం చేయడానికి తొలి మెట్టుగా ఇటీవల అధ్యయన సలహా కమిటీని ఏర్పాటు చేసింది.
ఇప్పటి పథకాల కంటే మెరుగ్గా..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని కొన్ని కార్యక్రమాలను అమలులోకి తీసుకువచ్చారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, వలస కార్మికుల కష్టాలు, సమస్యలను తెలుసుకోడానికి ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తోంది. వలస కార్మికుల కుటుంబాలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రత్యేక కోటా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కార్మికుల్లో నైపుణ్యత..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వలస వెళుతున్న కార్మికుల్లో అనేక మందికి ఎలాంటి నైపుణ్యం లేదు. నైపుణ్యం లేని కారణంగా అనేక మంది కార్మికులు తక్కువ జీతాలకు పని చేయడం, ఉద్యోగ భద్రత లేక అవస్థలు పడుతున్నారు. కేరళలో వలస వెళ్లేవారికి వారు ఎంచుకున్న రంగంలో కనీసం ఆరు నెలల శిక్షణ కోర్సులను అక్కడి ప్రభుత్వం అందిస్తుంది. గల్ఫ్ బోర్డు ఏర్పడితే శిక్షణ శిబిరాలను నిర్వహించడానికి అవకాశం ఉంటుంది.
మోసాలను అరికట్టే విధంగా..
గల్ఫ్ వెళ్లే ప్రయత్నంలో వీసాల కోసం డబ్బులు, ఒరిజినల్ పాస్‌పోర్టులను నకిలీ ఏజెంట్ల చేతుల్లో పెట్టి చాలామంది మోసపోతున్నారు. వలసదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల నకిలీ ఏజెంట్ల ఆటలు కట్టించడం, గుర్తింపు ఉన్న రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారానే వలస వెళ్లేలా గల్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తే వలస మోసాలను అరికట్టే అవకాశం ఉంటుంది.
తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తుండగా కొంతకాలం నుంచి మలేషియా, సింగపూర్, యూరప్ దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఆయా దేశాల్లోను కార్మికులుగానే మెజార్టీ వలసదారులు పని చేస్తున్నారు. దీంతో గల్ఫ్ యేతర దేశాల వలస కార్మికులకు ప్రయోజనాలు కల్పించేలా ప్రవాసీ విధానం అమలు చేయాలనే డిమాండ్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో సమగ్ర ప్రవాసీ విధానం (ఎన్‌ఆర్‌ఐ పాలసీ), గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేసినా చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ ప్రక్రియ మరుగునపడిపోయింది. ఇప్పుడు సలహా కమిటీ ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న ప్రవాసీ విధానంపై అధ్యయనం చేసి మన రాష్ట్రంలో అమలు చేయాల్సిన పాలసీ ఎలా ఉండాలి అనే అంశంపై తుది నివేదికను అందించాల్సి ఉంది.
గల్ఫ్ యేతర కార్మికులకు..
వైఎస్సార్ హయాంలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తర్వాత గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. అప్పట్లో గల్ఫ్ దేశాల్లో కాని గల్ఫ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకున్నారు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఇంటికి వచ్చిన వలస కార్మికులకు ఆయా కార్పొరేషన్‌ల ద్వారా రాయితీ రుణాలను అందించి అండగా ఉన్నారు. ఏది ఏమైనా అధ్యయన సలహా కమిటీ ఇచ్చే నివేదికపైనే గల్ఫ్ వలస కార్మికులు కొండంత ఆశతో ఉన్నారు.
సమగ్ర ప్రవాసీ విధానం రూపకల్పన,
గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు బాటలు
వేయనున్న ‘సలహా కమిటీ’
త్వరలో కార్యరూపం
దాల్చనున్న గల్ఫ్ బోర్డు