ఘనంగా ‘నెలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు | North Texas 160th Nela Nela Telugu Vennela Conference | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘నెలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు

Published Mon, Dec 28 2020 6:31 PM | Last Updated on Tue, Dec 29 2020 2:43 PM

North Texas 160th Nela Nela Telugu Vennela Conference - Sakshi

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 161వ'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు డాలస్‌లో ఘనంగా జరిగింది. నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహిక ఈ ఏడాది చివరి అంశంగా డిసెంబర్‌ మాసం సాహిత్యాభిమానులందరి మధ్య ఘనంగా జరిగింది.సభాసదుల ఉత్సాహం మార్గశిర మాసపు శీతలాన్ని తొలగించి వెడచ్చదనాన్ని నింపింది. చిరంజీవులు సాహితి వేముల, సిందూర వేముల “వినాయకా నిను వినా బ్రోచుటకు” అన్న రామకృష్ణ భాగవతార్ స్వామి వారి కీర్తన పాడి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వ విద్యాలయ పూర్వ అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణకుమారి విచ్చేశారు. ఈ సందర్భంగా..ఆయన ‘భారతదేశంలో స్త్రీ వాగ్గేయకారులు’’ అన్న అంశంపై విశేషమైన ప్రసంగం చేశారు. వాగ్గేయకారుల భక్తి సంగీత సాంప్రదాయాల పైనే తొలుత వీరి సిద్దాంత గ్రంథం ఉండగా ప్రత్యేక శ్రద్ధతో స్త్రీ వాగ్గేయకారులను వెలికితీసే పరిశోధన మొదలుపెట్టారు.


ఈ క్రమంలో భాగంగా ఇతర ద్రవిడ భాషలతో పరిచయం పెంచుకొని తెలుగే కాకుండా తమిళ, కన్నడ భాషలలోని ప్రతిభా మూర్తులైన సాహిత్యకారిణుల చరిత్రావలోకనం చేశారు. ఒక్క కీర్తన రూపంలోనే కాకుండా.. లయ తాళ జ్ఞానం, భావ స్పష్టత విచక్షణాగుణం (కాకువు) ప్రదర్శంచిన రచయిత్రులు కూడా వాగ్గేయకారిణులే అన్న విశేష సందేశాన్ని తెలియజేశారు. వేదకాలంలోని సూర్య, గోష, వాక్ మొదలైన ఋషికలను మొదట పరిచయం చేసి తమిళ సంగమ సాహిత్యంలో ఎన్నదగ్గ విదుషీమణులైన కరైక్కాల్, ఆండాళ్ వారి తిరుప్పావై సూక్తులను స్వయంగా కూడా సంగీతజ్ఞులైన కృష్ణ కుమారి సభలో రాగయుక్తంగా పాట రూపంలో వినిపించారు. కన్నడ నాటి హన్నమ్మ, రఘనాథనాయకుని సభలలో ప్రభవిల్లిన తెలుగు ప్రతిభా మూర్తులు రామభధ్రాంబ, పసుపులేటి రంగాజమ్మలను సైతం గుర్తు చేశారు. శాంతి స్వభావం, సమతుల్యత గుణాలు ప్రకృతి వరప్రసాదంగా పొందిన స్త్రీలు తమ రచనలలో లాలిత్యము, మాతృ ప్రేమ, భక్తి తత్వ సుగంధ పరిమళాలను ఎంత సహజ సుకుమారంగా పొందు పరుస్తారో కృష్ణ కుమారి చెప్పి స్త్రీ జాతికి గర్వాతిశయాన్ని ఆపాదించి మెప్పించారు.

ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న“మన తెలుగు సిరి సంపదలు” ధారావాహిక లో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి గారు ఆధునిక కవుల ఉక్తులు సూక్తులు అన్న శీర్షిక క్రింద బసవరాజు, విశ్వనాథ, సోమసుందర్, దాశరథి వంటి వారి ప్రసిద్ద కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్యులను చర్చలో భాగస్వాములును చేయడం జరిగింది. అదే అంశంలో భాగంగా పొడుపు కథలు, అర్థభేదం గల జంట పదాలు, వ్యుత్పత్వర్థాలు అనే పలు శీర్షికల పరంపరను ఉరుమిండి వారు ప్రశ్న జవాబుల రూపంలో కొనసాగించారు. ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన పారజాతాపహరణ కృతికర్త ముక్కు తిమ్మనార్యుని ముద్దు పలుకులను సభలో ఉటంకించి పండించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, డిసెంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులు నార్ల, ఉన్నవ, కట్టమంచి, బలిజేపల్లి వంటి ఎందరో మహానుభావులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరుముఖ్య అతిధి ఉస్మానియా విశ్వ విద్యాలయ పూర్వ అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణకుమారికి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలకు, మిగిలిన వక్తలకు,విచ్చేసిన సాహిత్య అభిమానులకి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement