ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి! | Palm Springs Aerial Tramway Mountain Station California USA | Sakshi
Sakshi News home page

U: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!

Published Tue, Apr 9 2024 12:09 PM | Last Updated on Tue, Apr 9 2024 6:07 PM

Palm Springs Aerial Tramway Mountain Station California USA - Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద ఏరియల్ ట్రాంవే

దాదాపు 80 మంది ఒకేసారి ప్రయాణించచొచ్చు

సరైన సౌకర్యాలు ఉంటే ఏ పర్యాటక ప్రాంతమైనా, పుణ్యక్షేత్రమైనా ఎంతో అభివృద్ధి చెందుతుంది, అందులో ముఖ్యమైనవి రవాణా, వసతులు. అగ్రరాజ్యం, అన్నింటా అభివృద్ధి చెందిన అమెరికాలో ఇలాంటి మౌలిక/ఆధునాతన సదుపాయాల గురించి చెప్పుకోనక్కర్లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏరియల్ ట్రాంవే గా ప్రసిద్ధి గాంచింది కాలిఫోర్నియా రాష్ట్రం ఐడిల్ వైల్డ్ దగ్గరున్న ‘ పామ్ స్ప్రింగ్స్ ఏరియల్ ట్రామ్ వే ’. సందర్శకుల శ్రమ, సమయం తగ్గించి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్శించడానికి దీన్ని 1963 లో నిర్మించారట. ఇది చేసే పని ఏంటంటే.. పర్యాటకులను కొచెల్లా లోయ నుంచి సముద్రానికి 8500 అడుగులకు పైగా ఎత్తులో నున్న ‘ మౌంట్ సాన్ జెసంటో శిఖరం ’ హిల్ స్టేషన్కు ఏరియల్ వే ద్వారా తీసుకుపోవడం.

దాదాపు 80 మంది ఒకేసారి ప్రయాణించగలిగిన ఒక పెద్ద రూం టైపు బాక్స్ ను ఈ రోప్ వే కేవలం 10 నిమిషాల వ్యవధిలో 2.5 మైళ్ళ దూరం పైకి చేర్చుతుండడం విశేషం. రోప్‌వే బాక్సులోని అద్దాల నుంచి పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. లాస్‌ఎంజెల్స్‌ నుంచి మౌంట్ సాన్ జెసింటో స్టేట్ పార్క్ కు తీసుకెళ్ళినప్పుడు ఈ రోప్ వేలో ప్రయాణం చేసే అవకాశం లభించింది. పామ్‌ స్ప్రింగ్‌ ఏరియల్‌ ట్రామ్‌వేగా పిలిచే ఈ రోప్‌వే.. కొండలు, గుట్టల మధ్య నుంచి ప్రయాణం చేస్తుంది. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న ఈ రోప్‌వే ప్రపంచంలోనే అత్యంత పొడవైనదట. ఒక్కొక్కరికి ఒక ప్రయాణానికి 29 డాలర్ల ఖరీదు. మన రుపాయలతో పోలిస్తు దాదాపుగా రూ.2300. మన రోప్‌వే బాక్స్‌ అంతా అద్దాలతోనే ఉండడం వల్ల ఎటువైపైనా చూడొచ్చు. పది నిమిషాలే కాబట్టి నిలబడి ప్రయాణం చేసినా.. అలిసిపోకపోగా.. మంచి అనుభూతి కలుగుతుంది.

దాదాపుగా ఎడారిమయమైన ఈ ప్రాంతంలో రాళ్ల గుట్టలు పైకి పొడుచుకుని వచ్చినట్టుగా ఉంటాయి. వాటి మీదుగా రోప్‌వేలో అద్దాల గదిలో ప్రయాణం చేసినప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుంది. పైన హిల్ స్టేషన్ లో థియేటర్లు, రెస్టారెంట్లు, షాపుల వంటివి కూడా చాలా ఉన్నాయి. హిల్‌ స్టేషన్‌లోని వ్యూపాయింట్‌ నుంచి అగ్గిపెట్టెల్లాంటి భవనాలు, చిన్నదైపోయిన నగరం.. మనం ఎంత ఎత్తుకు వచ్చామా అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇలాంటి రోప్ వేలను మన హిల్ స్టేషన్ల వద్ద, పుణ్యక్షేత్రాల వద్ద నిర్మిస్తే పర్యాటకులకు, భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది కదా అనిపించింది.

మనదేశం ఉత్తరాదిన ప్రముఖ దేవాలయాలకు ఇప్పటికే ఇలాంటి రోప్ వే లు ఉన్నాయి, అలాంటివాటిలో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ మానసాదేవి ఆలయం ఒకటి. అలాగే నైనా దేవి ఆలయానికి కూడా రోప్‌వే వేశారు. యాదగిరిగుట్ట ఆలయానికి వేయాలన్న ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఉంది. తిరుపతి కేంద్రంగా ఒకటి బస్ స్టాండ్ నుంచి, రెండవది రైల్వే స్టేషన్ నుంచి తిరుమల పైకి వెళ్లడానికి రెండు రోప్ వే లు నిర్మించే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వార్తలు. తిరుమల ఘాట్ రోడ్డు మీద ప్రయాణాల రద్దీ తగ్గించడానికి , కాలుష్యాన్ని అరికట్టడానికి, ఇటు భక్తులు అటు వన్యప్రాణులు రెండింటి రక్షణకు కూడా ఈ ఏరియల్ రోప్ వే లు ఉపయోగపడేవి.
వేముల ప్రభాకర్‌

(చదవండి: అమెరికాలో వెయ్యేళ్ల చెట్లు..! చూస్తే ఆశ్చర్యపోతారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement