భువనేశ్వర్: బలంగీర్ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశారు. పోస్టల్ ఉద్యోగాల కోసం బూటకపు విద్యార్హతలతో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 21 మంది నిందితులను అరెస్టు చేసినట్లు బొలంగీరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నితిన్ కుషాల్కర్ తెలిపారు. అరెస్టు చేసినవారిలో 19 మంది నిరుద్యోగ యువతతో పాటు కోచింగ్ సెంటర్ యజమాని, కంప్యూటర్ టీచర్ ఉన్నట్లు గుర్తించారు. ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ స్థావరంగా ఈ కుంభకోణం యథేచ్ఛగా కొనసాగింది. ఈ నేపథ్యంలో జరిపిన సోదాల్లో రూ.3,67,600 నగదుతో పాటు 41 ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన 1,000 నకిలీ (డూప్లికేట్) సర్టిఫికెట్లు, వెరిఫికేషన్ రిపోర్టులు, నాలుగు కంప్యూటర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 33 స్టాంపులు, జిరాక్స్ మెషిన్, ప్రింటర్, సీల్స్, డైరీలు, రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, భూపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అచ్చం ఒరిజినల్ మాదిరిగానే..
స్వాధీనం చేసుకున్న నకిలీ సర్టిఫికెట్లు అచ్చం ఒరిజినల్ సర్టిఫికెట్లు మాదిరిగానే ఉన్నట్లు ఎస్పీ వివరించారు. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ యజమాని మనోజ్ మిశ్రా పలు విద్యాసంస్థల ఉద్యోగులతో సంబంధాలు బలపరచుకొని ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ వ్యవహారంలో భూముల అక్రమ కొనుగోలు వ్యవహారం సైతం బయటపడిందన్నారు. నిందితులకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.
శాసనసభలో చర్చ
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో బొలంగీర్ నకిలీ సర్టిఫికెట్ల అంశంపై చర్చ చోటుచేసుకుంది. కంటాబంజి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా ఈ అంశాన్ని మంగళవారం శూన్య గంటలో లేవనెత్తారు. ఈ ఉదంతం రాష్ట్రంలో మేధావుల బతుకుల్ని అంధకారంలోకి నెట్టుతున్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ రాకెట్‌లో బిజూ జనతా దళ్ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఓనమాలు తెలియని అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం కావడం విచారకరమన్నారు. వీరందర్ని ఎన్‌ఎస్‌ఏలో బుక్ చేసేందుకు స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని కోరారు.
ఇదీ విషయం
ఇటీవల విడుదలైన బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ (బీపీఎం), సహాయ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ వంటి 83 పోస్టుల భర్తీకి అభ్యర్థులు దాఖలు చేసిన మార్కు షీట్లు, సర్టిఫికెట్ల పరిశీలనలో తేడాలున్నట్లు పోస్టల్ అధికారులు గుర్తించడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి పొందిన నకిలీ మార్కు షీట్లు, సర్టిఫికేట్లను కనీసం 37 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. వీరిలో ఇంగ్లిష్‌లో ఒకరు 98 శాతం, ఇంకొకరు 99 శాతం మార్కులు పొందినట్లు గుర్తించడంతో డొంక కదిలింది. ఈ ఇద్దరు అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షలో విఫలమయ్యారు. దీనిపై ఆరా తీయడంతో ఒక అభ్యర్థి రూ.50,000 చెల్లించి బోర్డు పరీక్ష సర్టిఫికెట్‌ను కొనుగోలు చేసినట్లు బహిరంగ పరిచాడు. నిందితులు గత ఎనిమిది నుంచి పదేళ్లుగా ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ వ్యవధిలో చాల మంది నిరుద్యోగులు నిర్ధిష్ట కోచింగ్ సెంటర్ నుంచి నకిలీ సర్టిఫికేట్లు పొంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారన్నారు. నిందితులు ఒక్కో సర్టిఫికేట్, మార్క్ షీట్‌కు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. నిరుద్యోగుల ఆరాటాన్ని సొమ్ము చేసుకునే సందర్భాల్లో ఒక్కో నకిలీ సర్టిఫికేటు కోసం రూ.5 లక్షల వరకు గుంజినట్లు తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment