duplicate certificates
-
చదవకుండానే సర్టిఫికెట్లు..! అచ్చం ఒరిజినల్ మాదిరిగానే..
భువనేశ్వర్: బలంగీర్ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశారు. పోస్టల్ ఉద్యోగాల కోసం బూటకపు విద్యార్హతలతో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 21 మంది నిందితులను అరెస్టు చేసినట్లు బొలంగీరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నితిన్ కుషాల్కర్ తెలిపారు. అరెస్టు చేసినవారిలో 19 మంది నిరుద్యోగ యువతతో పాటు కోచింగ్ సెంటర్ యజమాని, కంప్యూటర్ టీచర్ ఉన్నట్లు గుర్తించారు. ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్థావరంగా ఈ కుంభకోణం యథేచ్ఛగా కొనసాగింది. ఈ నేపథ్యంలో జరిపిన సోదాల్లో రూ.3,67,600 నగదుతో పాటు 41 ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన 1,000 నకిలీ (డూప్లికేట్) సర్టిఫికెట్లు, వెరిఫికేషన్ రిపోర్టులు, నాలుగు కంప్యూటర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 33 స్టాంపులు, జిరాక్స్ మెషిన్, ప్రింటర్, సీల్స్, డైరీలు, రబ్బర్ స్టాంపులు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, భూపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అచ్చం ఒరిజినల్ మాదిరిగానే.. స్వాధీనం చేసుకున్న నకిలీ సర్టిఫికెట్లు అచ్చం ఒరిజినల్ సర్టిఫికెట్లు మాదిరిగానే ఉన్నట్లు ఎస్పీ వివరించారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యజమాని మనోజ్ మిశ్రా పలు విద్యాసంస్థల ఉద్యోగులతో సంబంధాలు బలపరచుకొని ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ వ్యవహారంలో భూముల అక్రమ కొనుగోలు వ్యవహారం సైతం బయటపడిందన్నారు. నిందితులకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. శాసనసభలో చర్చ ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో బొలంగీర్ నకిలీ సర్టిఫికెట్ల అంశంపై చర్చ చోటుచేసుకుంది. కంటాబంజి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా ఈ అంశాన్ని మంగళవారం శూన్య గంటలో లేవనెత్తారు. ఈ ఉదంతం రాష్ట్రంలో మేధావుల బతుకుల్ని అంధకారంలోకి నెట్టుతున్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ రాకెట్లో బిజూ జనతా దళ్ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఓనమాలు తెలియని అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం కావడం విచారకరమన్నారు. వీరందర్ని ఎన్ఎస్ఏలో బుక్ చేసేందుకు స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని కోరారు. ఇదీ విషయం ఇటీవల విడుదలైన బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ (బీపీఎం), సహాయ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ వంటి 83 పోస్టుల భర్తీకి అభ్యర్థులు దాఖలు చేసిన మార్కు షీట్లు, సర్టిఫికెట్ల పరిశీలనలో తేడాలున్నట్లు పోస్టల్ అధికారులు గుర్తించడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి పొందిన నకిలీ మార్కు షీట్లు, సర్టిఫికేట్లను కనీసం 37 మంది అభ్యర్థులు దాఖలు చేశారు. వీరిలో ఇంగ్లిష్‌లో ఒకరు 98 శాతం, ఇంకొకరు 99 శాతం మార్కులు పొందినట్లు గుర్తించడంతో డొంక కదిలింది. ఈ ఇద్దరు అభ్యర్థులు డిపార్ట్మెంట్ నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షలో విఫలమయ్యారు. దీనిపై ఆరా తీయడంతో ఒక అభ్యర్థి రూ.50,000 చెల్లించి బోర్డు పరీక్ష సర్టిఫికెట్‌ను కొనుగోలు చేసినట్లు బహిరంగ పరిచాడు. నిందితులు గత ఎనిమిది నుంచి పదేళ్లుగా ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ వ్యవధిలో చాల మంది నిరుద్యోగులు నిర్ధిష్ట కోచింగ్ సెంటర్ నుంచి నకిలీ సర్టిఫికేట్లు పొంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారన్నారు. నిందితులు ఒక్కో సర్టిఫికేట్, మార్క్ షీట్‌కు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. నిరుద్యోగుల ఆరాటాన్ని సొమ్ము చేసుకునే సందర్భాల్లో ఒక్కో నకిలీ సర్టిఫికేటు కోసం రూ.5 లక్షల వరకు గుంజినట్లు తేలిందన్నారు. -
డూప్లికేట్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సులభతరం..సెబీ
న్యూఢిల్లీ: డూప్లికేట్ (నకలు) సెక్యూరిటీ సర్టిఫికెట్ల జారీకి అనుసరించే విధానం, డాక్యుమెంటేషన్ ప్రక్రియను సెబీ సులభతరం చేసింది. సెక్యూరిటీ సర్టిఫికెట్ల నకలు కోరేవారు అందుకు సమర్పించాల్సిన పత్రాలతో జాబితాను సెబీ ప్రకటించింది. ప్రస్తుతం డూప్లికేట్ సెక్యూరిటీల సర్టిఫికెట్ల జారీకి రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏలు) అనుసరిస్తున్న విధానాన్ని సెబీ సమీక్షించింది. ఇన్వెస్టర్ల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. డూప్లికేట్ సర్టిఫికెట్ కోరేవారు ఎఫ్ఐఆర్ కాపీ (ఈ–ఎఫ్ఐఆర్ కూడా) ఒరిజినల్ సెక్యూరిటీల ఫోలియో నంబర్, డిస్టింక్టివ్ నంబర్, సర్టిఫికెట్ నంబర్ల వివరాలను ఆర్టీఏలకు సమర్పించాలి. సెక్యూరిటీలు పోగొట్టుకున్నట్టు తెలియజేస్తూ వార్తా పత్రికలో ప్రకటన కూడా ఇవ్వాలి. అఫిడవిట్, ఇంటెమ్నిటీ బాండ్‌ను నిర్దేశిత విధానంలో సమర్పించాల్సి ఉంటుందని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎటువంటి ష్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ దరఖాస్తు సమర్పించే నాటికి పోగొట్టుకున్న సెక్యూరిటీల విలువ రూ.5 లక్షకు మించకపోతే ఇవేవీ అవసరం లేదని సెబీ పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఒకవేళ షేర్ సర్టిఫికెట్ నంబర్, ఫోలియో నంబర్, డిస్టింక్టివ్ నంబర్ ఇవేవీ లేకపోతే ఆర్టీఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంతకం రికార్డులతో సరిపోలితే ఆర్టీఏ ఈ వివరాలను సెక్యూరిటీ హోల్డర్‌కు ఇవ్వాలని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిపోలేకపోతే అప్పుడు కేవైసీ వివరాలతో సెక్యూరిటీ హోల్డర్ తన గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాత వివరాలు పొందాల్సి ఉంటుందని తెలిపింది. -
డాక్ట‘రేట్లు’..డాక్టరేట్లోయ్!
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఏదైనా కారణాలతో డాక్టర్ కాలేకపోయారా? కనీసం గౌరవ డాక్టరేట్ పొందాలన్న మీ ప్రయత్నాలు ఫలించలేదా? అయితే, నిరాశ వద్దు.. వెంటనే సంప్రదించండి.. గ్లోబల్ పీస్ యూనివర్సిటీని. కేవలం రూ.20వేల నుంచి రూ.40 వేలకే డాక్టరేట్ ఇస్తాం. మీ విద్యార్హతలతో పనిలేదు, మీరెలాంటి సంఘసేవ, సామాజిక బాధ్యతలు, కళా సేవలు చేయాల్సిన అక్కర్లేదు. అడిగినంత చెల్లించండి.. మీకు నచ్చిన డాక్టరేట్ తీసుకెళ్లండి’అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ వ్యవహారం డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ సర్టిఫికెట్ల కుంభకోణంపై సరైన విచారణ జరిపించాలని, సర్టిఫికెట్లు ప్రదానం చేసినవారిని, తీసుకున్నవారిని అరెస్టు చేయాలని లోక్‌సత్తా నాయకులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ దందా దక్షిణ భారత్‌లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో పలు నకిలీ విశ్వవిద్యాలయాలు వీటిని తమకు తోచిన ధరకు విక్రయించేస్తున్నాయి. గౌరవ డాక్టరేట్లతోపాటు, పలు ఆర్ట్స్ అండ్ సైన్స్‌ల్లోనూ ఈ డాక్టరేట్లు ఇస్తుండటంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఈ ముఠా వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కర్ణాటకలోని మైసూరు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తీసుకున్న వారిపై చర్యలేవి..? మైసూరు, బెంగళూరు, చెన్నై, పుదుచ్చేరి ప్రాం తాల్లో ఈ నకిలీ వర్సిటీలు చెలరేగిపోతున్నాయి. యూనివర్సల్ పీస్ వర్సిటీ, లింకోక్వింగ్, గ్లోబల్‌ఆక్స్‌ఫర్, ఇంటర్నేషనల్ పీస్ వర్సిటీ, కింగ్స్ వర్సిటీ పేరిట పలువురు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీటికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఎలాంటి అనుమతులు లేవని విద్యావేత్తలు చెబుతున్నారు. వీరి కార్యకలాపాలు మన రాష్ట్రం దాకా విస్తరించాయి. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ఈ దం దా జోరుగా సాగుతోంది. దీని కోసం సబ్జెక్టును బట్టి రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పైగా ఈ సర్టిఫికేట్ల ప్రదానోత్సవాలను దక్షిణ భారత్‌లోని ప్రముఖ హోటళ్లలో వైభవంగా నిర్వహిస్తుండటం పోలీసులనే నివ్వెరపరుస్తోంది. ఆగస్టులో కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ, విద్యా, ఆర్థిక, వ్యాపార రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు డాక్టరేట్లు అందుకున్నా రు. చివరకు ఎలాంటి విద్యార్హత లేని రియల్టర్లు, బిల్డర్లు కూడా వీటిని సంపాదిస్తుండటం విశేషం. బయటపడిందిలా?... ఈ సంగతి తేలుద్దామని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో గ్లోబల్ పీస్ యూనిర్సిటీని సంప్రదించగా.. ఎలాంటి సామాజిక సేవ చేయకపోయినా రూ.40 వేలు చెల్లిస్తే సామాజిక సేవ విభాగంలో డాక్టరేట్ జారీ చేస్తామన్నారు. కానీ, తన వద్ద రూ.20 వేలే ఉన్నాయని చెప్పడంతో 50 శాతం డిస్కౌంట్‌తో డాక్టరేట్ జారీ చేశారు. దీంతో ఈ గుట్టు రట్టయింది. ఈ నకిలీ డాక్టరేట్ల స్కాంపై ఉస్మానియా వర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ .. యూజీసీకి ఇటీవల ఫిర్యాదు చేసింది. ఇలాంటి వారి వల్ల నిజంగా డాక్టరేట్ పొందిన వారికి గుర్తింపు, విలువ లేకుండా పోతాయని కరీంనగర్‌కి చెందిన లోక్‌సత్తా ఉద్యమకారుడు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్టిఫికెట్ల స్కాంపై సీఎం, డీజీపీలకు శనివారం ఫిర్యాదు చేశామన్నారు. -
ఇంజనీరింగ్ 75,000, లా పట్టా 2,00,000
ముంబై: కాలేజీకి వెళ్లే అవసరం లేదు..పరీక్షలు రాయాల్సిన పని అంతకన్నా లేదు.. రూ.75వేలు పెడితే ఇంజినీరింగ్ డిగ్రీ, రూ.2 లక్షలు మనవి కావనుకుంటే లా డిగ్రీ చేతికి అందుతుంది. ఒక్క 45 రోజులు ఓపిక పడితే ఏకంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు చేతికి వచ్చేస్తాయి. న్యూస్18 రహస్య ఆపరేషన్‌లో ఈ చీకటి దందా వెలుగు చూసింది. 2016లో పూర్తి చేసినట్లుగా బీఏ డిగ్రీ పట్టా ఇచ్చేందుకు న్యూస్18 మీడియా వ్యక్తులతో నవీ ముంబైలోని కోపర్ఖైరానీ ప్రాంతానికి చెందిన కీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి చెందిన ఏజెంట్ స్వప్నిల్ గైక్వాడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డిగ్రీని యూజీసీ, ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ప్రముఖ వర్సిటీలు యశ్వంత్రావ్ చవాన్ యూనివర్సిటీ నుంచి గానీ సోలాపూర్ యూనివర్సిటీ నుంచి గానీ ఇస్తానన్నాడు. ఇందుకు 45 రోజుల సమయం పడుతుందని, 30 రోజుల తర్వాత డిగ్రీపట్టా జిరాక్స్ ప్రతులు, మరో 15 రోజుల తర్వాత ఒరిజినల్ పత్రాలను అందజేసేందుకు అంగీకరించాడు. ‘వర్సిటీకి గానీ, క్లాసులకు గానీ వెళ్లాల్సిన అవసరం లేదు. 2016లో డిగ్రీ పూర్తి చేసినట్లుగానే సంబంధిత పత్రాల్లో ఉంటుంది. వర్సిటీ రికార్డుల్లో కూడా ఇవి జత పరిచి ఉంటా యి. ఇవి ఎక్కడా తనిఖీల్లో పట్టుబడేం దుకు అవకాశం లేదు’ అని అతడు భరోసా ఇచ్చాడు. ఇంజినీరింగ్, ఎల్ఎల్బీతోపాటు వివిధ వర్సిటీల్లో పీహెచ్డీ చేసినట్లుగా కూడా సర్టిఫికెట్లు ఇస్తాం కానీ, ఫీజులు వేర్వేరుగా ఉంటాయన్నాడు. మూడేళ్ల ఇంజినీరింగ్ పట్టాకైతే రూ.75 వేలు, ఇందులో సగం ముందుగా, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చాక మిగతా సొమ్ము ఇవ్వాల్సి ఉంటుంది. పీహెచ్డీ డిగ్రీలైతే ఆంధ్రా వర్సిటీ నుంచి ఇస్తామని చెప్పాడు. థీసిస్, సినాప్సిస్ కూడా అందజేస్తానన్నాడు. యూపీలోని ఓ వర్సిటీ నుంచి పొందినట్లుగా ఉండే లా డిగ్రీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని గైక్వాడ్ చెప్పాడు. వర్సిటీల సంఖ్య పెరగడంతో తమ మార్కెట్ కూడా పెరిగిందని గైక్వాడ్ అన్నాడు. ప్రతి వర్సిటీకి టార్గెట్లున్నాయి. వాటి లక్ష్యం నెరవేరేందుకు మాలాంటి వారిని అవి ఆశ్రయిస్తున్నాయి. వర్సిటీలకు అడ్మిషన్లు కావాలి, మాకేమో డబ్బులు కావాలి’ అని తెలిపాడు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి పోఖ్రియాల్ ప్రకటించారు. -
వాట్సాప్‌లో వివరాలు... కొరియర్లో సర్టిఫికెట్లు!
సాక్షి, హైదరాబాద్ : ‘‘విద్యార్థుల వివరాలు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌కు ఇక్కడినుంచి వెళ్తాయి... అక్కడినుంచి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు కొరియర్లో సిటీకి చేరతాయి... వీటిని రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు విక్రయించి ఆ సొమ్మును నిందితులు పంచుకుంటారు’’...ఇలా వ్యవస్థీకృతంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల దందాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దందాలో నగరానికి చెందిన నిందితుడిని పట్టుకున్నామని, పరారీలో ఉన్న ఛత్తీస్‌గఢ్ వాసి కోసం గాలిస్తున్నామని టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. నిందితుడు జేఎన్టీయూ నుంచి బీటెక్ పూర్తి చేసినట్లు వివరించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ హబీబ్ 2012లో జేఎన్టీయూ నుంచి బీటెక్ (ఈఐఈ) పూర్తి చేశాడు. కొన్నాళ్ల పాటు టోలీచౌకిలోని ఓ కాలేజీలో పరిపాలన విభాగంలో పని చేశాడు. ఆపై మలక్‌పేటలో సొంతంగా అలీఫ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నకిలీ సర్టిఫికెట్ల ప్రారంభించాడు. ఛత్తీస్‌గఢ్ లోని బోర్డ్ ఆఫ్ స్కూల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు చెందిన సునీల్ కపూర్ అలియాస్ బాలాజీ తరచుగా హైదరాబాద్‌కు వస్తూ తమ సంస్థ తరఫున ప్రచారం చేసే వాడు. టెన్త్, ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన వారితో తమ బోర్డ్‌లో అప్లై చేయిస్తూ వారిని పాస్ చేయించేవాడు. ఇలా ఇతడికి హబీబ్‌తో పరిచయం ఏర్పడింది. 2015లో అక్కడి హైకోర్టు బోర్డ్ ఆఫ్ స్కూల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించింది. దీంతో నకిలీ సర్టిఫికెట్ల దందాకు దిగిన సునీల్ ఈ విషయం హబీబ్‌కు చెప్పాడు. బోగస్ విద్యార్హత పత్రాలు కావాలంటూ హబీబ్ వద్దకు వచ్చిన విద్యార్థుల వివరాలను సునీల్‌కు పంపేవాడు. వీటి ఆధారంగా టెన్త్, ఇంటర్‌లతో పాటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను రూపొ ందించేవాడు. మధ్యప్రదేశ్‌లోని స్వామి వివేకానంద, రాజస్తాన్ విద్యాపీఠ్, మీరట్‌లోని సీహెచ్ చరణ్‌సింగ్, కాన్పూర్‌లోని ఛత్రపతి శివాజీ మహరాజ్, ఝాన్సీలోని బుందేల్‌ఖండ్, విశాఖలోని ఆంధ్రా, చెన్నైలోని అన్నామలై, వర్సిటీ ఆఫ్ పుణే, వీబీఎస్ పూర్వాంచల్ వర్సిటీలతో పాటు ఢిల్లీలోని బోర్డ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్లతో వీటిని తయారు చేసి కొరియర్లో హబీబ్‌కు పంపేవాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీలతో కూడిన బృందం బుధవారం దాడి చేసి హబీబ్‌ను పట్టుకోవడంతో పాటు 16 నకిలీ సర్టిఫికెట్లు తదితరాలు స్వాధీనం చేసుకుంది. కేసును నాంపల్లి పోలీసులకు అప్పగించిన టాస్క్‌ఫోర్స్ పరారీలో ఉన్న సునీల్ కోసం గాలిస్తోంది. -
నకిలీ సర్టిఫికెట్లతో వ్యవసాయ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు చేస్తున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారెవరో తెలుసుకుని చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. ఉమ్మడి ఏపీలో 30 మంది వరకు నకిలీ సర్టిఫికెట్లతో వ్యవసాయ శాఖలో అధికారులుగా పనిచేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. రాష్ట్రం విడిపోయాక ఆ 30 మందిలో ఏపీకి వెళ్లిన 20 మంది నకిలీ సర్టిఫికెట్లతో పనిచేస్తున్నారని తేలింది. దీంతో అక్కడ వారిపై చర్యలు తీసుకున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన 10 మంది తెలంగాణలో పనిచేస్తున్నారని, వారిపై విచారణ జరగకపోవడంతో ఏ చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో సంబంధిత ఫైలును తెప్పించుకున్న వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ఎన్నికలయ్యాక ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. నకిలీ సర్టిఫికెట్లతో ఇంకా అనేకమంది... నకిలీ సర్టిఫికెట్లతో రాష్ట్రంలో 10 మందే కాకుండా ఇంకా అనేకమంది ఉన్నారని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. వీరు కీలకపోస్టుల్లో ఉండటంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. దీంతో మొత్తం అందరి జాబితా తయారు చేసి వారెక్కడ చదివారో ఆయా కాలేజీలకు వెళ్లి విచారణ చేయాలని యోచిస్తోంది. చాలామంది ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో చదివి ఉండొ చ్చు. ఇక్కడ విచారణ చేయడం సులువు. ఇక కొందరు వివిధ రాష్ట్రాల్లో చదివారు. ఇలాంటి వారెవరో జాబితా తయారు చేసి ఐకార్ గుర్తింపు ఉన్న చోట చదివారా? లేదా? పరిశీలిస్తారు. ఎక్కడా చదవకుండా నకిలీ సర్టిఫికెట్ పొందిన వారెవరో గుర్తించాలని అధికారులు యోచిస్తున్నారు. -
కోర్టులో ఉద్యోగం కోసం చీటింగ్
లీగల్ (కడప అర్బన్) : జిల్లా కోర్టులో ఉద్యోగం పొందేందుకు ఓ మహిళ నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడంతో ఆమెపై కేసు నమోదు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కోర్టులో అటెండర్‌గా పనిచేస్తూ గాజులపల్లి సీతామహాలక్ష్మి ఏడాది క్రితం మృతి చెందింది. ఆమె వారసురాలిగా కుమార్తె దీపిక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. తాను పదవ తరగతి చదివినప్పటికీ ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవి సమర్పించింది. వీటిని ఇంటెలిజెన్సీ విభాగం వారికి కోర్టు వారు పరిశీలన నిమిత్తం పంపించారు. పదో తరగతి సర్టిఫికెట్ వరకు ఒరిజినల్‌గా ఉన్నట్లు, మిగతా ఇంటర్మీడియేట్, డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవిగా గుర్తించారు. వెంటనే స్పందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను అదేశించారు. అప్పటి ఏఓ వెంకట నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 20వ తేదీన వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో 420, 468, 471 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లుగా దీపికకు సర్టిఫికెట్లు ఇచ్చిన ముఠాపై దృష్టి పెట్టారు. వారిలో ఐదుగురిని గుర్తించి కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. ఈ ముఠాలో కడప నగరం మోచంపేటకు చెందిన షేక్ పర్వేజ్ అహ్మద్, అక్కాయపల్లెకు చెందిన సయ్యద్ గులాం జిలానీ, ఎర్రముక్కపల్లెకు చెందిన సగబాల మహేంద్రబాబు, అనంతపురం నగరానికి చెందిన పిడతల హరనాథ్, సిరిగుప్ప రాఘవేంద్రలు ఉన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సోమవారం సాయంత్రం జిల్లా కోర్టులో విలేకరులకు వెల్లడించారు. అటెండర్ ఉద్యోగం చేయడానికి నామోషిగా భావించి ఉన్నత ఉద్యోగం పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి దొరికిపోయిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
అమీర్‌పేట : ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ వీరస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మేడ్చల్‌కు చెందిన రమేష్‌బాబు, నాగేష్ అమీర్‌పేట, మధురానగర్‌లో కన్సల్టెన్సీల పేరుతో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రెండు కార్యాలయాలకు భరత్ అనే వ్యక్తి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాడు. ప్రము ఖ కంపెనీలకు చెందిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్న వీరు నకిలీ సర్టిఫికెట్లు అంటగట్టి నిరుద్యోగుల నుండి లక్షల్లో డబ్బులు దండుకునేవారు. దీనిపై సమాచారం అందడంతో పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి అమీర్‌పేట, మధురానగర్ లోని కార్యాలయాలపై దాడులు నిర్వహించి నిందితులు రమేష్‌బాబు, నగేష్, భరత్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి ఫాం 16, వివిధ కంపెనీలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంపు లు ఐడీ కార్డులతో పాటు రూ.6500 నగదు,12 సీపీయూలు, 9 మానీటర్లు, 5 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ వికలాంగుల లీలలు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సకలాంగులైన ఉద్యోగులు వికలాంగులుగా అవతారమెత్తారు. వి కలాంగ ఉద్యోగులకు దక్కాల్సిన అ లవెన్సులు ప్రతినెలా నొక్కేస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు వర్సిటీ ఖజానాకు చిల్లుపడుతోంది. మరోవైపు పీజీ , ‘లా’, పీహెచ్డీ అభ్యసిస్తున్న వికలాంగ విద్యార్థులకు దక్కాల్సిన సౌకర్యాల కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లోను మెస్ బిల్లులు పూర్తిగా మినహాయింపు ఉన్నా, వర్సిటీలో అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుదకు వికలాంగ విద్యార్థులకు వస్తున్న ప్రాజెక్ట్‌లు కూడా వారికి దక్కకుండా చేస్తున్నారు. కానీ ప్రతి నెలా వికలాంగుల పేరుతో వర్సిటీ చెల్లిస్తున్న అలవెన్సులు స్వాహా చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకొన్న పాపాన పోలేదు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్లతో పబ్బం ప్రతి నెలా ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక అలవెన్స్ జీతం కాకుండా అదనంగా రూ. 1350 వర్సిటీ చెల్లిస్తుంది. ఈ అలవెన్స్‌ను తీసుకోవడానికి ఆరోగ్య అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకరావాల్సి ఉంటుంది. పీహెచ్సీ 60శాతం పైగా ఉంటేనే వీరికి అలవెన్సు తీసుకోవడానికి అర్హత ఉంటుంది. అది కూడా జన్మతా గానీ, ప్రమాదవశాత్తు వికలాంగులై ఉండాలి. అయితే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొందుపరచి ప్రతినెలా అలవెన్సులు స్వాహా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం పనిచేసే శాశ్వత కార్మికులకు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకు స్వాంతన కలిగించడం కోసం ఈ అలవెన్సులు చెల్లించాలని సూచించింది. కానీ వేలికి స్వల్పపాటి గాయమైనా కూడా పీహెచ్ కోటాలో ఈ విధంగా లబ్ధి పొందడం గమనార్హం. రెండు దశాబ్దాలుగా అక్రమాలు రెండు దశాబ్దాలకుపైగా వికలాంగుల∙కోటాలో అలవెన్సులు తీసుకొంటున్నారని సమాచారం. మొత్తం 26 మంది ఉద్యోగులు వికలాంగ అలవెన్సు తీసుకొంటున్నారు. ఇందులో 12 మంది సకలాంగులు అయినప్పటికీ ప్రత్యేక అలవెన్సు తీసుకోవడం గమనార్హం. ఏ విధమైన వికలాంగత్వం లేకపోయినప్పటికీ వికలాంగులుగా పరిగణించి ధ్రువపత్రాలు ఏవిధంగా ఇచ్చారు. అవి సరైన పత్రాలా? కాదా? అని అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు. -
దారితప్పారు
సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. బోగస్ బిల్లులతో మెడికల్ రీయింబర్స్మెంట్ కాజేయడం... ప్రమోషన్ల కోసం బోగస్ సర్టిఫికెట్లు... నకిలీ చాలన్లతో డబ్బులు మాయం చేయడం, నకిలీ స్టాంప్‌లతో పాఠశాలలకు బోగస్ అనుమతి పత్రాలు జారీ చేయడం వంటి ఘటనలతో ఇప్పటికే పరువు పోతుండగా... తాజాగా మరో అవినీతి బాగోతం వెలుగుచూసింది. నకిలీ వికలాంగుల ధ్రువీకరణ పత్రాలతో అప్పనంగా అలవెన్సులు పొందుతున్న వైనం విస్మయం గొల్పుతోంది. కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:విద్యాశాఖలో రోజుకో అవినీతి బాగోతం వెలుగులోకి వస్తోంది. తాజాగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పీహెచ్సీ కోటాలో అలవెన్సులు స్వాహా చేస్తున్న ఉపాధ్యాయుల, ఉద్యోగుల బండారాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలుచేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ప్రభు త్వ సొమ్ము స్వాహా చేస్తున్నారనే సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు ఏడా ది క్రితం విచారణ చేశారు. జిల్లానుంచి వికలాంగుల కోటాలో అలవెన్సులు పొందుతున్న ఉపాధ్యాయుల, విద్యాశాఖ ఉద్యోగుల వివరాలు సేకరించగా.. 500 మంది అలవెన్సులు పొందుతున్నట్లు తేలింది. అక్రమాలు జరుగుతున్నాయని ప్రాథమికంగా తేలడంతో పూర్తిస్థాయి విచారణ కోసం రాష్ట్ర విద్యాశాఖ అధికారులను సం ప్రదించి డీఈవో ద్వారా ఉపాధ్యాయుల వివరాలు రాబట్టారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఉపాధ్యాయుల అవినీతి బాగోతం గుట్టురట్టయింది. మొదటి విడతగా విచారణ చేసిన జాబితాలోనే 15 మంది ఉపాధ్యాయులు తప్పుడు పత్రాలు సమర్పించి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నట్లు తేలింది. అలవెన్సుల కోసం.. వికలాంగుల కోటాలో ఉపాధ్యాయులకు ప్రతినెలా అలవెన్సు కింద రూ.900తోపాటు రూ.200 వృత్తి పన్ను మినహాయింపు, బదిలీలు, పదోన్నతుల్లో 3శాతం రిజర్వేషన్, రూ.లక్ష వరకు ఇన్‌కంటాక్స్ మినహాయింపు, ఇతర వెసులుబాటు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఉపాధ్యాయులు తప్పుడు వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, అదనపు సౌకర్యాలు పొందేందుకు కక్కుర్తి పడ్డారు. రికవరీకి ఆదేశాలు విజిలెన్స్ విచారణలో జిల్లాలోని 15 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో వారిపై క్రమశిక్షణ చర్యలతోపాటు ఇప్పటివరకు పొందిన అలవెన్సులు రికవరీ చేయాలని విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి బుధవారం జిల్లా విద్యాశాఖాధికారికి ఆదేశాలందాయి. ఈ మేరకు సదరు ఉపాధ్యాయులపై చర్యలకు విద్యాశాఖ సమాయత్తమైంది. దీంతో అక్రమంగా అలవెన్సులు పొందుతున్న ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటివరకు 15 మంది అక్రమాలకు పాల్పడినట్లు తేలగా మిగతా వారిపైనా విచారణ కొనసాగుతోంది. వీరంతా ఎప్పటినుంచి ఈ అలవెన్సులు పొందుతున్నారు? ఎంత మొత్తం స్వాహా అయిందనే లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అక్రమంగా అలవెన్సులు పొందుతున్న ఉపాధ్యాయులు వీరే... ఎండీ.షకీల్‌అహ్మద్, జెడ్పీహెచ్ఎస్ కోత్తపేట, వెల్గటూర్ మండలం శ్రీనివాసరావు, జెడ్పీహెచ్ఎస్, పాతగూడురు, వెల్గటూర్ ఎం.బాపురెడ్డి, శివంగాలపల్లె, కోనరావుపేట మండలం ఎం.రాజిరెడ్డి, ఎస్ఏ, మొగ్దుంపూర్, కరీంనగర్ కె.లక్ష్మయ్య , వడ్లూరు, బోయినపల్లి బి.అమరేందర్‌రెడ్డి, పెద్దకురమపల్లె, చొప్పదండి బి.హనుమండ్లు, గట్టుభూత్కుర్, గంగాధర వలిఅలీ, స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్, కరీంనగర్ రాజా మహేందర్‌రెడ్డి, శాంతినగర్, కరీంనగర్(పీఎస్) వెంకటరమణారెడ్డి, జెడ్పీహెచ్ఎస్, నగునూరు, కరీంనగర్ ప్రభాకర్‌రెడ్డి, నగునూరు, కరీంనగర్ జరీనాబేగం, ప్రియదర్శిని కాలనీ- బొమ్మకల్, కరీంనగర్ పి. రాజు, విలాసాగర్, బోయినపల్లి మండలం రాాజిరెడ్డి, పీఆర్కేనగర్, కరీంనగర్ డి. చంద్రయ్య, గంజ్ హైస్కూల్ అటెండర్, కరీంనగర్ -
నకిలీ సర్టిఫికెట్లుతో పదోన్నతులు
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘ఊరందరిది ఒక దారి.. ఉలిపి కట్టెది మరోదారి’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు జిల్లా విద్యాశాఖ అధికారులు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి అడ్డదారిలో పదోన్నతులు పొందిన వారిపై, నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి డబ్బు డ్రాచేసి ప్రభుత్వానికి పంగనామాలు పెట్టిన వారిపై చర్య తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా.. జిల్లా అధికారులు తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది పోలీస్‌శాఖ పరిధిలో ఉందని విద్యాశాఖ అధికారులు చెపుతుండగా.. పూర్తి స్థాయిలో రికార్డులు ఇవ్వలేదని, అందుకే కేసు నమోదు చేయలేకపోతున్నామని పోలీస్ అధికారులు అంటున్నారు. ఇరుశాఖల ఉద్యోగులు కలిసి కావాలనే కేసులు పెట్టకుండా జాప్యం చేసి అక్రమార్కులకు అండగా ఉంటున్నారని జిల్లాఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆంగ్లవిద్యను బలోపేతం చేయాలనే ఆలోచనతో అన్ని సబ్జెక్టులతోపాటు ఆంగ్లం బోధించేందుకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేశారు. ఇందుకోసం ఇంగ్లిష్ మీడియంలో డిగ్రీ చదివి, బీఈడీలో ఇంగ్లిష్ మెథడాలజీ ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పిం చారు. దీనిని అదనుగా చేసుకొని పలువురు ఉపాధ్యాయులు వివిధ యూనివర్సిటీల్లో చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ప్రమోషన్లు పొందారు. స.హ.చట్టం ద్వారా తెలుసుకున్న సమాచారంతో జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొం దారని, అర్హత ఉన్న తమకు ప్రమోషన్లు రాలేదని ఒరిజనల్ ఇంగ్లిష్ టీచర్స ఫోరం అధ్వర్యంలో కోర్టును, లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర అధికారులు రం గంలోకి దిగి జిల్లాలో 66 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించగా ఆయా యూనివర్సిటీల దూరవిద్య పట్టాలకు గు ర్తింపు ఉందని ట్రిబ్యునల్ తాత్కాలికంగా తీర్పు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రాష్ట్ర అధికారులు ఆదేశించడతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. విద్యాశాఖ వింతపోకడపై అనుమానాలు... ఇతర జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన ఉపాధ్యాయుల ఆరెస్టులు కొనసాగుతుంటే మన జిల్లా అధికారులు మాత్రం జాప్యం చేయడం పలు అనుమానాలకు తావి స్తోంది. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొం దిన పలువురు ఉపాధ్యాయులు.. తమ బండారం బయటపడి కటకటాలపాలయి తే పరువుతోపాటు, ఉద్యోగం, డబ్బులు కోల్పోవాల్సి వస్తుందని భావించి, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఓ ఉద్యోగికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ముట్టజెప్పినట్లు ప్రచారం. అందుకే అక్రమార్కులపై కేసులు పెట్టకుండా వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయగా మన జిల్లాలో మాత్రం విద్యాశాఖ అధికారులు సీబీసీఐడీ అధికారులపైన, వారు విద్యాశాఖ అధికారులపైనా నెట్టి కాలయాప చేస్తున్నారని ఒరిజనల్ టీచర్స ఫోరం నాయకులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నకిలీ సర్టిఫికెట్లతో మెడికల్ బిల్లులు స్వాహా చేసిన 23 మందిపై కేసులు పెట్టాలని డీఈవో ఆయా ఎంఈవోలను ఆదేశించినా ఇప్పటి వరకు గుండాల, సత్తుపల్లి, ఖమ్మం, చర్ల, ఎర్రుపాలెం మండలాలకు చెందిన ఎనిమిది మందిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మిగిలిన వారి రికార్డులు పోలీసులకు సక్రమంగా అందజేయకపోవడతో కేసులు పెట్టడంలో జా ప్యం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నా యి. ఇలా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు అధికారుల చేతివాటం మూలంగానే అక్రమార్కులపై కేసులు పెట్టకుండా జా ప్యం చేస్తున్నారని ప్రచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకొని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటాం : డీఈఓ అక్రమార్కులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన వారి గురించి ఉన్నతాధికారులతో చర్చించి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అక్రమంగా మెడికల్ బిల్లులు డ్రా చేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్పీని కలిశామని, విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామని ఆయనƒ చెప్పారని వివరించారు. -
మరో నాలుగు వికెట్లు
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ నకిలీ బధిర సర్టిఫికెట్లతో వివిధ డీఎస్సీల్లో పలువురు ఉపాధ్యాయులుగా నియామకమైన వ్యవహారంలో మరో నాలుగు వికెట్లు పడ్డారుు. ఈ బాగోతంలో బాధ్యులైన విద్యాశాఖలోని నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు... జిల్లా విద్యాశాఖాధికారులుగా గతంలో పనిచేసిన ముగ్గురి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు కలెక్టర్ కిషన్ లేఖ రాయడం విద్యాశాఖలో కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో 2002 నుంచి 2012 వరకు నిర్వహించిన వివిధ డీఎస్సీల్లో పలువురు నకిలీ బధిర సర్టిఫికెట్లతో ఉపాధ్యాయులుగా నియామకమైన ఉదంతం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై జిల్లా విద్యాశాఖ పరిధిలో డీఆర్డీఏ పీడీ విజయగోపాల్ను విచారణాధికారిగా నియమించారు. ఎవరెవరు నకిలీ సర్టిఫికెట్లతో ఉపాధ్యాయులుగా నియమితులయ్యూరో విచారణలో తేలింది. దీంతో జిల్లా విద్యాశాఖలో పనిచేసే ఆ సెక్షన్‌లోని ఉద్యోగులను వేరే చోటకు పంపించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని విచారణాధికారి విజయగోపాల్ గతంలోనే సూచించినప్పటికీ... గతంలోని విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. అరుుతే ఈ మేరకు 17మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయగా... అందులో ఇద్దరు అరెస్టయ్యూరు. మిగతా వారు ముందుస్తు బెయిల్ తీసుకోగా... నకిలీ బధిర సర్టిఫికెట్ల సూత్రధారి బి.రమేష్‌ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద బ్యాంకు డిపాజిట్లు, బంగారం స్వాధీనం చేసుకోవడంతోపాటు కీలక ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖలోని పలువురు ఉద్యోగులకు కూడా సంబంధం ఉందనే అరోపణలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని డీఎస్సీ సెక్షన్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఫకృద్దీన్, డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్‌ను ఆర్వీఎంకు, డీఈఓ కార్యాలయంలో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సూపరింటెండెంట్ నయీమొద్దీన్ను ఆర్‌ఎంఎస్‌ఏకు డిప్యూటేషన్‌పై పంపుతూ ప్రస్తుత డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో కలెక్టర్ జి.కిషన్ పరిశీలించారు. గత విచారణ నివేదిక ఆధారంగా ప్రస్తుత డీఈఓ నుంచి రిపోర్ట్‌ను తెప్పించుకున్నారు. నకిలీ బధిర సర్టిఫికెట్లతో ఉపాధ్యాయులుగా పలువురు నియామకమైన వ్యవహారంలో అప్పటి జిల్లా విద్యాశాఖలో పనిచేసిన డీఈఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే లేఖతోపాటు బాధ్యులైన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఫకృద్దీన్, జగదీశ్వర్ ను సస్పెండ్ చేస్తూ డీఈఓ... నయీమొద్దీన్తోపాటు గతంలో డీఈఓ కార్యాలయంలో పనిచేసి ప్రస్తుతం ఖమ్మం డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కేవీఎస్ఎస్ఎన్ఎస్ఆర్ మూర్తిని సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ వై.బాలయ్య ఉత్తర్వులు జారీచేశారు. ఆయా సెక్షన్లలో విధులు నిర్వర్తించిన సదరు ఉద్యోగులు సరిగా పరిశీలన చేయలేదని, అందుకు బాధ్యులుగా చేస్తూ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.అదేవిధంగా కమిటీలో ప్రధాన బాధ్యులుగా ఉన్న అప్పటి జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారులుగా పనిచేసిన పుష్పరాజ్, లక్ష్మారెడ్డి, డీఈఓగా పనిచేసిన రమేష్‌బాబు, డీఈఓ కార్యాలయంలో ప్రస్తుతం అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న వెంకటరమణపై క్రమశిక్షణ చ ర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు కలెక్టర్ లేఖ రాశారు. గతంలో ఇక్కడ ఇన్చార్జ్ డీఈఓగా ఉన్న పుష్పరాజ్ ప్రస్తుతం కడపలో పనిచేస్తుండగా, లక్ష్మారెడ్డి ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. రమేష్‌బాబు హన్మకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. కొంత కాలం క్రితం బదిలీ అయిన మూర్తి ఖమ్మం డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.