వాట్సాప్‌లో వివరాలు... కొరియర్లో సర్టిఫికెట్లు! | Details in Whatsaap and Certificates in Courier | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో వివరాలు... కొరియర్లో సర్టిఫికెట్లు!

Published Thu, Mar 21 2019 3:45 AM | Last Updated on Thu, Mar 21 2019 3:46 AM

Details in Whatsaap and Certificates in Courier - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘విద్యార్థుల వివరాలు వాట్సాప్, ఈ–మెయిల్‌ ద్వారా ఛత్తీస్‌గఢ్‌కు ఇక్కడినుంచి వెళ్తాయి... అక్కడినుంచి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు కొరియర్‌లో సిటీకి చేరతాయి... వీటిని రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు విక్రయించి ఆ సొమ్మును నిందితులు పంచుకుంటారు’’...ఇలా వ్యవస్థీకృతంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల దందాను  పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ దందాలో నగరానికి చెందిన నిందితుడిని పట్టుకున్నామని, పరారీలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ వాసి కోసం గాలిస్తున్నామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు.  నిందితుడు జేఎన్టీయూ నుంచి బీటెక్‌ పూర్తి చేసినట్లు వివరించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్‌ హబీబ్‌ 2012లో జేఎన్టీయూ నుంచి బీటెక్‌ (ఈఐఈ) పూర్తి చేశాడు. కొన్నాళ్ల పాటు టోలీచౌకిలోని ఓ కాలేజీలో పరిపాలన విభాగంలో పని చేశాడు. ఆపై మలక్‌పేటలో సొంతంగా అలీఫ్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నకిలీ సర్టిఫికెట్ల ప్రారంభించాడు.

ఛత్తీస్‌గఢ్‌ లోని బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌కు చెందిన సునీల్‌ కపూర్‌ అలియాస్‌ బాలాజీ తరచుగా హైదరాబాద్‌కు వస్తూ తమ సంస్థ తరఫున ప్రచారం చేసే వాడు. టెన్త్, ఇంటర్మీడియెట్‌ ఫెయిల్‌ అయిన వారితో తమ బోర్డ్‌లో అప్లై చేయిస్తూ వారిని పాస్‌ చేయించేవాడు. ఇలా ఇతడికి హబీబ్‌తో పరిచయం ఏర్పడింది. 2015లో అక్కడి హైకోర్టు బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించింది. దీంతో నకిలీ సర్టిఫికెట్ల దందాకు దిగిన సునీల్‌ ఈ విషయం హబీబ్‌కు చెప్పాడు. బోగస్‌ విద్యార్హత పత్రాలు కావాలంటూ హబీబ్‌ వద్దకు వచ్చిన విద్యార్థుల వివరాలను సునీల్‌కు పంపేవాడు. వీటి ఆధారంగా టెన్త్, ఇంటర్‌లతో పాటు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ సర్టిఫికెట్లను రూపొ ందించేవాడు. మధ్యప్రదేశ్‌లోని స్వామి వివేకానంద, రాజస్తాన్‌ విద్యాపీఠ్, మీరట్‌లోని సీహెచ్‌ చరణ్‌సింగ్, కాన్పూర్‌లోని ఛత్రపతి శివాజీ మహరాజ్, ఝాన్సీలోని బుందేల్‌ఖండ్, విశాఖలోని ఆంధ్రా, చెన్నైలోని అన్నామలై, వర్సిటీ ఆఫ్‌ పుణే, వీబీఎస్‌ పూర్వాంచల్‌ వర్సిటీలతో పాటు ఢిల్లీలోని బోర్డ్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ పేర్లతో వీటిని తయారు చేసి కొరియర్‌లో హబీబ్‌కు పంపేవాడు.  ఈ దందాపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్‌.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్‌ ముజఫర్‌ అలీలతో కూడిన బృందం బుధవారం దాడి చేసి హబీబ్‌ను పట్టుకోవడంతో పాటు 16 నకిలీ సర్టిఫికెట్లు తదితరాలు స్వాధీనం చేసుకుంది. కేసును నాంపల్లి పోలీసులకు అప్పగించిన టాస్క్‌ఫోర్స్‌ పరారీలో ఉన్న సునీల్‌ కోసం గాలిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement