సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఏదైనా కారణాలతో డాక్టర్ కాలేకపోయారా? కనీసం గౌరవ డాక్టరేట్ పొందాలన్న మీ ప్రయత్నాలు ఫలించలేదా? అయితే, నిరాశ వద్దు.. వెంటనే సంప్రదించండి.. గ్లోబల్ పీస్ యూనివర్సిటీని. కేవలం రూ.20వేల నుంచి రూ.40 వేలకే డాక్టరేట్ ఇస్తాం. మీ విద్యార్హతలతో పనిలేదు, మీరెలాంటి సంఘసేవ, సామాజిక బాధ్యతలు, కళా సేవలు చేయాల్సిన అక్కర్లేదు. అడిగినంత చెల్లించండి.. మీకు నచ్చిన డాక్టరేట్ తీసుకెళ్లండి’అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ వ్యవహారం డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ సర్టిఫికెట్ల కుంభకోణంపై సరైన విచారణ జరిపించాలని, సర్టిఫికెట్లు ప్రదానం చేసినవారిని, తీసుకున్నవారిని అరెస్టు చేయాలని లోక్‌సత్తా నాయకులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఈ దందా దక్షిణ భారత్‌లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో పలు నకిలీ విశ్వవిద్యాలయాలు వీటిని తమకు తోచిన ధరకు విక్రయించేస్తున్నాయి. గౌరవ డాక్టరేట్‌లతోపాటు, పలు ఆర్ట్స్ అండ్ సైన్స్‌ల్లోనూ ఈ డాక్టరేట్‌లు ఇస్తుండటంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఈ ముఠా వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కర్ణాటకలోని మైసూరు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
తీసుకున్న వారిపై చర్యలేవి..?
మైసూరు, బెంగళూరు, చెన్నై, పుదుచ్చేరి ప్రాం తాల్లో ఈ నకిలీ వర్సిటీలు చెలరేగిపోతున్నాయి. యూనివర్సల్ పీస్ వర్సిటీ, లింకోక్వింగ్, గ్లోబల్‌ఆక్స్‌ఫర్, ఇంటర్నేషనల్ పీస్ వర్సిటీ, కింగ్స్ వర్సిటీ పేరిట పలువురు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీటికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఎలాంటి అనుమతులు లేవని విద్యావేత్తలు చెబుతున్నారు. వీరి కార్యకలాపాలు మన రాష్ట్రం దాకా విస్తరించాయి. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ఈ దం దా జోరుగా సాగుతోంది. దీని కోసం సబ్జెక్టును బట్టి రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పైగా ఈ సర్టిఫికేట్ల ప్రదానోత్సవాలను దక్షిణ భారత్‌లోని ప్రముఖ హోటళ్లలో వైభవంగా నిర్వహిస్తుండటం పోలీసులనే నివ్వెరపరుస్తోంది. ఆగస్టులో కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ, విద్యా, ఆర్థిక, వ్యాపార రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు డాక్టరేట్లు అందుకున్నా రు. చివరకు ఎలాంటి విద్యార్హత లేని రియల్టర్లు, బిల్డర్లు కూడా వీటిని సంపాదిస్తుండటం విశేషం.
బయటపడిందిలా?...
ఈ సంగతి తేలుద్దామని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో గ్లోబల్ పీస్ యూనిర్సిటీని సంప్రదించగా.. ఎలాంటి సామాజిక సేవ చేయకపోయినా రూ.40 వేలు చెల్లిస్తే సామాజిక సేవ విభాగంలో డాక్టరేట్ జారీ చేస్తామన్నారు. కానీ, తన వద్ద రూ.20 వేలే ఉన్నాయని చెప్పడంతో 50 శాతం డిస్కౌంట్‌తో డాక్టరేట్ జారీ చేశారు. దీంతో ఈ గుట్టు రట్టయింది. ఈ నకిలీ డాక్టరేట్ల స్కాంపై ఉస్మానియా వర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ .. యూజీసీకి ఇటీవల ఫిర్యాదు చేసింది. ఇలాంటి వారి వల్ల నిజంగా డాక్టరేట్ పొందిన వారికి గుర్తింపు, విలువ లేకుండా పోతాయని కరీంనగర్‌కి చెందిన లోక్‌సత్తా ఉద్యమకారుడు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్టిఫికెట్ల స్కాంపై సీఎం, డీజీపీలకు శనివారం ఫిర్యాదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment