నకిలీ వికలాంగుల లీలలు
నకిలీ వికలాంగుల లీలలు
Published Sun, Jul 17 2016 9:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సకలాంగులైన ఉద్యోగులు వికలాంగులుగా అవతారమెత్తారు. వి కలాంగ ఉద్యోగులకు దక్కాల్సిన అ లవెన్సులు ప్రతినెలా నొక్కేస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు వర్సిటీ ఖజానాకు చిల్లుపడుతోంది. మరోవైపు పీజీ , ‘లా’, పీహెచ్‌డీ అభ్యసిస్తున్న వికలాంగ విద్యార్థులకు దక్కాల్సిన సౌకర్యాల కోసం ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. అన్ని విశ్వవిద్యాలయాల్లోను మెస్ బిల్లులు పూర్తిగా మినహాయింపు ఉన్నా, వర్సిటీలో అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుదకు వికలాంగ విద్యార్థులకు వస్తున్న ప్రాజెక్ట్‌లు కూడా వారికి దక్కకుండా చేస్తున్నారు. కానీ ప్రతి నెలా వికలాంగుల పేరుతో వర్సిటీ చెల్లిస్తున్న అలవెన్సులు స్వాహా చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకొన్న పాపాన పోలేదు.
నకిలీ మెడికల్ సర్టిఫికెట్లతో పబ్బం
ప్రతి నెలా ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక అలవెన్స్ జీతం కాకుండా అదనంగా రూ. 1350 వర్సిటీ చెల్లిస్తుంది. ఈ అలవెన్స్‌ను తీసుకోవడానికి ఆరోగ్య అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకరావాల్సి ఉంటుంది. పీహెచ్‌సీ 60శాతం పైగా ఉంటేనే వీరికి అలవెన్సు తీసుకోవడానికి అర్హత ఉంటుంది. అది కూడా జన్మతా గానీ, ప్రమాదవశాత్తు వికలాంగులై ఉండాలి. అయితే తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొందుపరచి ప్రతినెలా అలవెన్సులు స్వాహా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం పనిచేసే శాశ్వత కార్మికులకు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకు స్వాంతన కలిగించడం కోసం ఈ అలవెన్సులు చెల్లించాలని సూచించింది. కానీ వేలికి స్వల్పపాటి గాయమైనా కూడా పీహెచ్ కోటాలో ఈ విధంగా లబ్ధి పొందడం గమనార్హం.
రెండు దశాబ్దాలుగా అక్రమాలు
రెండు దశాబ్దాలకుపైగా వికలాంగుల∙కోటాలో అలవెన్సులు తీసుకొంటున్నారని సమాచారం. మొత్తం 26 మంది ఉద్యోగులు వికలాంగ అలవెన్సు తీసుకొంటున్నారు. ఇందులో 12 మంది సకలాంగులు అయినప్పటికీ ప్రత్యేక అలవెన్సు తీసుకోవడం గమనార్హం. ఏ విధమైన వికలాంగత్వం లేకపోయినప్పటికీ వికలాంగులుగా పరిగణించి ధ్రువపత్రాలు ఏవిధంగా ఇచ్చారు. అవి సరైన పత్రాలా? కాదా? అని అధికారులు పరిశీలించిన దాఖలాలు లేవు.
Advertisement