ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తుంటే కనిపించింది.ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఒకరు ఆత్మహత్య అని..అలా మరో పేజీ తిప్పానో లేదో సివిల్స్‌లో ఫెయిలయ్యానని
బలవన్మరణం అంటూ మరోవార్త ఇదేమిటి చిన్నచిన్న కారణాలతో ఇలా చనిపోవడాలు అనిపించింది.అప్పుడే నిన్న కలిసిన మహమ్మద్ యూనస్ గుర్తొచ్చాడు.. బతుకంతా కష్టాలు ఎదుర్కొన్నా అతడి మొహంలో చెదిరిపోని ఆ చిరునవ్వు గుర్తొచ్చింది.అంగవైకల్యం వెనక్కులాగుతున్నా..ముందుకు దూసుకెళ్లాలన్న అతడిగుండెధైర్యం ఈ ఆత్మహత్యల వార్తల సమయంలో మరీ గుర్తొచ్చింది.
ఆ మహమ్మద్ యూనస్ ఎవరో తెలుసుకుందాం. ఓ సాక్షి పాఠకుడి మాటల్లో అతడి కథను విందాం ఓ ఆయుర్వేద మందుల దుకాణంనుంచి మెడిసిన్స్ తెప్పించాలి. దాంతో ఒక బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్‌లో రైడర్‌ను బుక్ చేసుకుని మందులు ఇంటికి తెప్పించుకు న్నాను. కిందకు వెళ్లి అడిగాను.. డెలివరీ బాయ్ వచ్చాడా అని.. అప్పుడు నేనేనండి అంటూ నవ్వుతూ వచ్చాడు మహమ్మద్ యూనస్.. చూడగానే ఆశ్చర్యం కలిగింది.. ఎందుకంటే.. తను దివ్యాంగుడు.. ఎప్పుడూ ఈ పనిలో దివ్యాంగులను చూడని నేను ఆసక్తి తో అతడి వివరాలు అడిగాను.. అప్పుడు చెప్పాడు.. 36 ఏళ్ల యూనస్ తన కథ..
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ చెందిన యూనస్‌ది పేద కుటుంబం. చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. శరీరం సహకరించక పోయినా ఇంటర్ పూర్తి చేశాడు. ఒక మీడియా సర్వీసెస్ సంస్థలో పదేళ్లు పనిచేశాడు. అది మూతపడ్డాక ఒక మొబైల్ షాపులో చేరాడు. పైగా తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత ఇతడి మీదే పడింది. లాక్‌డౌన్‌తో ఆ మొబైల్ షాపు కాస్తా మూతపడటంతో బతుకు రోడ్డున పడింది. ఇదే సమయంలో అనారోగ్యంతో తన 6 నెలల బిడ్డనూ పోగొట్టుకున్నాడు. కష్టాల మీద కష్టాలు వచ్చిపడ్డాయి. కానీ గుండె ధైర్యం మాత్రం సడలలేదు. లాక్‌డౌన్ సడలించాక ఒక బైక్ ట్యాక్సీ యాప్ వేదికగా రైడర్‌గా మారాడు. ‘ఈ నా బండిని చూసి రోజూ ఒకరిద్దరు రైడ్ క్యాన్సిల్ చేసుకునేవారు.
కన్నీళ్లు వచ్చేవి. నా వైకల్యాన్ని చూసి రైడ్ క్యాన్సిల్ చేసుకున్నారని చాలా బాధపడ్డాను. అయితే.. బతకాలంటే పని చేయాలి. అందుకే పరుగు ఆపకూడదని నిర్ణయించుకున్నాను. రైడ్ లేకపోతే సరుకు డెలివరీ అయినా ఉంటుంది. రోజూ ఖర్చులుపోను ఇంటికి రూ.300 దాకా తీసుకువెళతాను. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నా రైడ్ ఆగదు.. సార్’ అంటూ చిరునవ్వుతో సెలవు తీసుకున్నాడు యూనస్. ‘ప్రభుత్వం నుంచి రుణం అందితే ఇంటి దగ్గర మీ సేవ లేదా మొబైల్/కిరాణా దుకాణం పెట్టుకోవాలన్న ఆలోచన ఉంది.. సార్’ అని తన మనసులోని మాట చెప్పాడు. ఈ ఆత్మహత్యల వార్తలు చదివాక.. యూనస్‌ను చూశాక అనిపించింది.
మనం చూడాల్సింది నిరాశ అనే నిశీధిని కాదు.. దాన్ని తరిమేసే ఆ చిరుదివ్వెను....
కష్టాల చీకట్లో మగ్గుతున్న ఎంతోమందికి ఈ యూనస్ కథ ఒక చిరుదివ్వెనే...
కీపిటప్.. మహమ్మద్ యూనస్..
Comments
Please login to add a commentAdd a comment