ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి వైద్యులతో రోగి జశ్వంత్‌కుమార్ (గ్రీన్ బనియన్)
శ్రీనగర్‌కాలనీ: మతి స్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి రాష్ట్రాలు దాటి వచ్చాడు. తను ఎవరో.. ఏమిటో.. ఎక్కడి వాడో కూడా తెలియని పరిస్థితి. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి వైద్యుల కృషితో కోలుకున్న అతడు దాదాపు 12 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందాన్ని అవధుల్లేవు. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరిడెంట్ డాక్టర్ ఉమాశంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన జశ్వంత్‌కుమార్ మతిస్థిమితం కోల్పోయాడు. అనుకోని పరిస్థితుల్లో ఖమ్మం చేరాడు. అక్కడి మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 2016 అక్బోబర్‌లో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ అందించిన వైద్యంతో కొన్ని నెలలకు కోలుకున్న అతడు.. తన పేరు జశ్వంత్‌కుమార్ అని, యూపీ అని మాత్రమే చెప్పాడు. పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో అదే విషయాన్ని ఖమ్మం మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, రోగికి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో ఎర్రగడ్డ ఆస్పత్రిలోనే చికిత్స అందించసాగారు. ూ మూడు నెలల క్రితం ఎర్రగడ్డ మానసిక
వైద్యులు ఓ కాన్ఫరెన్స్ నిమిత్తం లక్నో వెళ్లగా.. అక్కడ పోలీసింగ్ వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తున్నట్టు తెలుసుకున్నాడు. లక్నో పోలీసుల ‘హెల్పింగ్ పోర్టల్’ ద్వారా ఇక్కడ ఉంటున్న రోగి వివరాలను చెప్పారు. దీంతో గతంలో యూపీలో నమోదైన మిస్సింగ్ కేసులను వడగట్టగా.. జస్వంత్‌కుమార్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే అక్కడి పోలీసులతో మాట్లాడి రోగి బంధువులకు సమాచారం ఇవ్వగా.. వారు మంగళవారం ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి రోగి కుటుంబ సభ్యులు నలుగురు వచ్చి జశ్వంత్‌కుమార్‌ను కలిసి సంతోషం పట్టలేకపోయారు. జశ్వంత్‌కు సంబంధించిన గుర్తింపు కార్డులను పరిశీలించి ఆస్పత్రిలోని లీగల్ సెల్ ద్వారా అతడిని బంధువులకు అప్పగించారు. తమ తమ్ముడిని ఇన్నేళ్ల తర్వాత బాగుచేసి అప్పగించిన వైద్యులకు రోగి అన్న విశ్వనాథ్ వైద్య బృందాన్ని కృతజ్ఞతలు చెప్పాడు.
చాలా ఆనందంగా ఉంది..
ఎర్రగడ్డలో రోగులకు అత్యాధునిక వసతులతో చికిత్స అందిస్తున్నాం. చాలామంది రోగులకు చికిత్స అనంతరం వారి బందువుల వద్దకు, కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. కానీ ఓ మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి కోలుకుని 12 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను చేరుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రోగికి పూర్తి చికిత్స అందించాం. మా డాక్టర్లు లక్నో వెళ్లడం జస్వంత్‌కుమార్ బంధువుల వద్దకు చేర్చేలా చేసింది. – డాక్టర్ ఉమాశంకర్, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment