సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు చేస్తున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారెవరో తెలుసుకుని చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. ఉమ్మడి ఏపీలో 30 మంది వరకు నకిలీ సర్టిఫికెట్లతో వ్యవసాయ శాఖలో అధికారులుగా పనిచేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. రాష్ట్రం విడిపోయాక ఆ 30 మందిలో ఏపీకి వెళ్లిన 20 మంది నకిలీ సర్టిఫికెట్లతో పనిచేస్తున్నారని తేలింది. దీంతో అక్కడ వారిపై చర్యలు తీసుకున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన 10 మంది తెలంగాణలో పనిచేస్తున్నారని, వారిపై విచారణ జరగకపోవడంతో ఏ చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో సంబంధిత ఫైలును తెప్పించుకున్న వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ఎన్నికలయ్యాక ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
నకిలీ సర్టిఫికెట్లతో ఇంకా అనేకమంది...
నకిలీ సర్టిఫికెట్లతో రాష్ట్రంలో 10 మందే కాకుండా ఇంకా అనేకమంది ఉన్నారని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. వీరు కీలకపోస్టుల్లో ఉండటంతో ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. దీంతో మొత్తం అందరి జాబితా తయారు చేసి వారెక్కడ చదివారో ఆయా కాలేజీలకు వెళ్లి విచారణ చేయాలని యోచిస్తోంది. చాలామంది ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో చదివి ఉండొ చ్చు. ఇక్కడ విచారణ చేయడం సులువు. ఇక కొందరు వివిధ రాష్ట్రాల్లో చదివారు. ఇలాంటి వారెవరో జాబితా తయారు చేసి ఐకార్ గుర్తింపు ఉన్న చోట చదివారా? లేదా? పరిశీలిస్తారు. ఎక్కడా చదవకుండా నకిలీ సర్టిఫికెట్ పొందిన వారెవరో గుర్తించాలని అధికారులు యోచిస్తున్నారు.
నకిలీ సర్టిఫికెట్లతో వ్యవసాయ ఉద్యోగాలు
Published Mon, Dec 10 2018 2:16 AM | Last Updated on Mon, Dec 10 2018 2:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment